జగన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు.. డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ఖాయం.. భూమన

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు తిరుమల చుట్టూ తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యికి బదులు జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ శనివారం ( సెప్టెంబర్ 28, 2024 ) తిరుమలకు వెళ్లనున్నట్లు ప్రకటించటం హాట్ టాపిక్ గా మారింది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే జగన్ స్వామివారిని దర్శించుకోవాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని.. జగన్ ను డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమని అన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదని అన్నారు.

ఐదేళ్లు సీఎంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించినప్పటికీ జగన్ ను డిక్లరేషన్ అడగటం దారుణమని అన్నారు. జగన్ డిక్లరేషన్ పై ఇంత రాద్ధాంతం జరుగుతున్న చంద్రబాబు మాట్లాడట్లేదని మండిపడ్డారు. డిక్లరేషన్ వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని, తమను ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని అన్నారు భూమన. రోజురోజుకీ ముదిరి పాకాన పడుతున్న తిరుమల లడ్డూ వివాదం ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.