సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా శ్రీవారి దర్శనం కలిగేందుకు ప్రాధాన్యత కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ధనవంతులు, వీఐపీ దర్శనాల గురించి తాపత్రయ పడేవారిని శ్రీవారి ఆశీస్సులు కలగవనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. 53వ టీటీడీ చైర్మన్ గా భూమనకరుణాకరరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా తనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు 2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. .
ఇదిలా ఉంటే శుక్రవారం ( ఆగస్టు 11) నాడు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయి భక్తులు క్యూలైన్ వెలుపలకు వచ్చేశారు. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గురువారం( ఆగస్టు 10) శ్రీవారిని 57 వేల 443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.9 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 28వేల198 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.