
మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ భూస్థాపితం కావడం ఖాయమని భూపాలపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ గండ్ర సత్యనారాయణ రావు చెప్పారు. భూపాలపల్లి జిల్లా టేకుముట్ల మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రజాదీవెన యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పథకాల ఆశ చూపుతూ ఓట్ల కోసం ప్రజలను బ్రతిమిలాడుకునే పరిస్థితి అధికార పార్టీకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలకు దక్కాల్సిన పథకాలు పార్టీ లీడర్లకే దక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బండపల్లి సర్పంచ్ నామని రాజేందర్, వార్డు సభ్యులు, పలు గ్రామాలకు చెందిన లీడర్లు సత్యనారాయణరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటగిరి సతీశ్‌గౌడ్ పాల్గొన్నారు.