భూపాలపల్లి అర్భన్, వెలుగు: స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. భూపాలపల్లి మున్సిపల్ ఆఫీస్‌ను కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుధ్యం, స్వచ్చ ఆటోల నిర్వహణ, స్వీపింగ్ యంత్రం వినియోగం, స్వచ్ఛ వాహనాలకు జీపీఎస్ ఏర్పాటులో అలసత్వం వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ నవీన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి రోజూ ఉదయాన్నే పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. హరితహారం నిధులతో ప్లాంటేషన్, స్వచ్ఛ భారత్ నిధులతో పారిశుధ్య పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు. అనంతరం హనుమాన్ నగర్లో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ ను పరిశీలించారు.
ఆపరేషన్ తర్వాత కుక్కలను కొన్ని రోజులు విడివిడిగా ఉంచేందుకు బోన్ల సంఖ్యను పెంచాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ అధికారి గోపాల కృష్ణమూర్తి, టీపీవో సునీల్, మున్సిపల్ ఇంజినీర్ మానస, మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.