గంజాయితో జీవితాలను నాశనం చేసుకోవద్దు : ఎస్పీ కిరణ్ ఖరే

గంజాయితో జీవితాలను నాశనం చేసుకోవద్దు : ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి అర్భన్​, వెలుగు: గంజాయి సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం భూపాలపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన వారికి స్టేషన్ ఆవరణలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, గంజాయి రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

వరుస నేరాలకు పాల్పడుతూ, గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. గంజాయి రవాణా చేసేవారు, సేవించేవారు తమ కుటుంబం కోసం మారాలని, మత్తు పదార్థాలకు బానిసలై అనారోగ్యాల పాలుకావొద్దని చెప్పారు.   గంజాయికి అలవాటుపడిన  వారి వివరాలు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు, భూపాలపల్లి సీఐ నరేశ్​ కుమార్, చిట్యాల సీఐ మల్లేశ్, ఎస్సైలు సుధాకర్, సాంబమూర్తి, రవికుమార్, అశోక్ పాల్గొన్నారు. 

ALSO Read : మణుగూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ