- నాలుగు రోజులుగా విడవని వర్షం
- ఇండ్లకే పరిమితమైన జనం
- పొంగుతున్న వాగులు..నిలిచిన రాకపోకలు
- పెరిగిన గోదావరి ఉధృతి..అధికారుల అలర్ట్
- ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
- ముంపు ప్రాంతాల ప్రజలను
- సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఆగకుండా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి, ములుగు జిల్లాలు ఆగమవుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం కూడా వర్షం కురుస్తూనే ఉండడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయి. వరదలతో వాజేడు మండలంలో ఎన్‌హెచ్ 163 రోడ్డును బ్లాక్ చేశారు. వాగులు పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరిగింది.
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 5.52 లక్షల క్యూసెక్కులు, ములుగు జిల్లా సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8 లక్షల క్యుసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో రెండు జిల్లాల అధికారులు అలర్టయ్యారు. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి వెయ్యి మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ములుగులో 11 సెం.మీ, వెంకటాపురంలో 9.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం దగ్గర గోదావరి కరకట్టకు ప్రమాదం పొంచి ఉండడంతో ఆఫీసర్లు హుటాహుటిన ఇసుక బస్తాలు వేయించారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపాలని ఆదేశించారు.
తెగిపోయిన రాళ్లవాగు బ్రిడ్జి
ములుగు పీఎస్ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి తెగిపోయింది. వెంకటాపూర్ మండల పరిధిలో మోరాంచవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున గుర్రంపేట రోడ్డు కూడా తెగింది. దేవగిరిపట్నం నుంచి అన్నంపల్లి మధ్యలో రోడ్ మీద లో లెవెల్ కాజ్వే పైన, లింగాపూర్ నుంచి ఎన్‌హెచ్163 మీదుగా జవహర్ నగర్ వెళ్లే దారిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది.
దీంతో రాకపోకలు బంద్ చేశారు. ములుగు మండలంలోని లోతట్టు ప్రాంతాలైన సర్వాపూర్–జగ్గన్న గూడెం మధ్య బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. లో లెవెల్ వంతెన పై నుంచి వరద నీరు వెళ్తుండగా ఎవరూ వాగు దాటవద్దని పోలీసులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ –భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద వరద నీరు చేరుకోగా, రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చీకుపల్లి–- గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్య నేషనల్ హైవేపై వరద చేరింది.
బొగత జలపాతానికి వరద ఉధృతి కొనసాగుతోంది. వీరభద్రవరంలోని ముత్యాలధార వాటర్ ఫాల్స్‌కు ఎవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకటాపురం మండలంలో అత్యవసర పరిస్థితిలో వినియోగించుకోవడానికి రెండు బోట్లు తీసుకువచ్చారు. వీటిని పాత్రపురం, కొండాపురం గ్రామాలకు తరలించారు. భూపాలపల్లి జిల్లాలో ఇంద్రావతి నది పోటెత్తడంతో పలిమెల మండలంలోని దమ్మూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మహాదేవపూర్ మండలం చంద్రుపల్లి–నాగపల్లి వాగులు పొంగడంతో పంటచేలల్లోకి నీళ్లు చేరాయి. అన్నారం బ్యారేజీ నుంచి 18 వేల క్యూసెక్కుల నీళ్లను కిందికి వదులుతున్నారు. అటు ప్రాణహిత నది, ఇటు గోదావరి ఉప్పొంగడంతో
కాళేశ్వరం పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద 10 మీటర్ల ఎత్తుతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క
ఆగకుండా కురుస్తున్న వానలతో అతాలకుతలమవుతున్న ములుగు జిల్లాలో ఆదివారం మంత్రి సీతక్క పర్యటించారు. జాకారం గట్టమ్మ దేవాలయం మధ్యలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను, అక్కడి వరద ఉధృతిని వర్షంలోనే పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, జిల్లా ఆఫీసర్లు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఇంజినీర్లను ఆదేశించారు. ములుగు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజలు అవసరముంటే తప్పా బయటకు రావొద్దన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నందున ఎవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.