
మహాముత్తారం, వెలుగు : అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో జరిగింది. బోర్లగూడెం గ్రామానికి చెందిన కడారి రజనీకాంత్ (19) టెన్త్ వరకు చదివాడు. ఆ తర్వాత తండ్రి పెద్ద రాజయ్యతో కలిసి ఐదు ఎకరాల సొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. రెండేండ్ల నుంచి పత్తి సాగులో నష్టాలు రావడం, అప్పు రూ. 3 లక్షలకు పెరగడంతో రజనీకాంత్ మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఈ నెల 14న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రజనీకాంత్ ను ట్రీట్‌మెంట్ కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ సోమవారం చనిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.