ధర్పల్లి, వెలుగు: ధర్పల్లిని మున్సిపాలిటీగా మారుస్తామని రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ధర్పల్లిలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధర్పల్లిలో వంద పడకల హాస్పిటల్‌ను నిర్మిస్తామన్నారు. పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ కు అధికారం కోల్పోయ్యాక ప్రజల కష్టాలు గుర్తుకొస్తున్నాయన్నారు. నెల రోజుల పాలన పూర్తి కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని నెరవేర్చని బీఆర్ఎస్కు ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు.
పదేండ్లలో ఏ ఒక్కరికీ రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనూ ఒక్క డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కూడా కట్టలేదని వాపోయారు. కాంగ్రెస్‌పాలనలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు.
చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
ధర్పల్లి మండల కేంద్రంలో చెరువుకట్ట వద్ద చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆవిష్కరించారు. ఐలమ్మ పోరాటస్ఫూర్తిని కొనియాడారు. అనంతరం గురడికాపు సంఘంలో ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ధర్పల్లి సర్పంచి ఆర్మూర్పెద్ద బాల్‌రాజ్, ఎంపీపీ సారిక, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆర్మూర్చిన్న బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.