భూటాన్​… ప్రశాంతతకు పర్మనెంట్​ అడ్రస్​

భూటాన్​ ప్రపంచ మ్యాప్​లో కనిపించే అతి చిన్న రాచరికపు దేశాల్లో ఒకటి. ఇండియాలో ఒక రాష్ట్రమంత! ప్రజలు కోరకుండానే రిఫార్మ్​లు చేపట్టడంలో భూటాన్​ రాజు ముందున్నారు. హిమాలయాల్లో డెమొక్రసీతో సాగుతున్న రాజ్యం. కాంక్రీట్​ జంగిల్​లా కాకుండా, ట్రాఫిక్​ సౌండ్​ పొల్యూషన్​ లేకుండా ప్రశాంతతకు పర్మనెంట్​ అడ్రస్​లా ఉంటుంది భూటాన్​.

భూటాన్ చాలా సైలెంట్ దేశం. సహజంగా వివాదాలకు దూరంగా ఉంటుంది. హిమాలయ కొండల దగ్గర ఉండే ఈ చిన్న దేశానికి అటు చైనా ఇటు ఇండియా సరిహద్దులుగా ఉన్నాయి. దేశం చిన్నదైనా భూటాన్ కు ఎన్నో  స్పెషాలిటీలు ఉన్నాయి. అక్కడి ఆచారాలు  చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. చుట్టూ నిటారుగా ఉండే పెద్ద పెద్ద కొండలు, ఎటు చూసినా సెలయేళ్లు, పొల్యూషన్ లేని అడవులు….ఇదీ అసలు సిసలు భూటాన్.  వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ ప్రభావం ఏమాత్రం పడకుండా ఇప్పటికీ ఈ చిన్న దేశం సంప్రదాయాలను కాపాడుకుంటోంది. భూటాన్ లోకి అడుగుపెడితే అడవి పక్కన ఉండే ఓ పెద్ద పల్లెటూరులోకి  వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. కాంక్రీట్ జంగిల్లాంటి  పట్టణాలు ఎక్కడా కనిపించవు. రణగొణ ధ్వనులు ఏమాత్రం వినిపించవు. సెలయేళ్ల మధ్య  ప్రశాంతంగా నడిచివెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సౌత్ ఆసియాలోని ఈ చిన్న దేశం 1974 వరకు ప్రపంచానికి దూరంగా బతికింది. మిగతా దేశాల ప్రజలెవరూ భూటాన్ వైపు చూసేవారు కాదు. 1974 తర్వాత మార్పులు వచ్చాయి. టూరిస్టులు ఈ హిమాలయ దేశానికి రావడం మొదలైంది. ఇప్పుడు భూటాన్ కు టూరిస్టుల తాకిడి పెరిగింది.భూటాన్ ఖజానాకు టూరిజం బాగా సాయ పడుతోంది. ప్రకృతి అందాల నడుమ ఉండే ఈ చిన్ని దేశాన్ని చూడటానికి విదేశీ టూరిస్టులు బాగా ఉత్సాహం చూపుతుంటారు. భూటాన్ వెళ్లాలంటే ఇండియన్లకు వీసా అక్కర్లేదు.

భూటాన్ లో ఇప్పటికీ మాతృస్వామ్య  వ్యవస్థే కొనసాగుతోంది. తల్లిదండ్రుల ఆస్తులు కూతుళ్లకే  వస్తాయి. మగవాళ్లు పెళ్లి  తర్వాత భార్య తరఫున వచ్చిన ఇంటికి ఫిష్ట్ అవుతారు. ప్రపంచంలోనే  మాతృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉన్న అతి కొద్ది దేశాల్లో భూటాన్ ఒకటి. ఒకప్పుడు ఇక్కడ రాచరిక పాలన ఉండేది. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా దేశాల్లో  పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.  భూటాన్ ప్రజలకు ఈ పోరాటాల అవసరం రాలేదు. అక్కడి రాజులే, ప్రజాస్వామ్యానికి వెల్ కం పలికారు. 2008 లో అప్పటి రాజు కింగ్ జిగ్మే  ఖేసర్ నాంగ్యేల్  వాంగ్ చుక్  ప్రజాస్వామ్యంతో  కూడిన రాచరిక ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. పేరుకు అక్కడ రాచరికం ఉన్నా జరిగేది ప్రజాస్వామ్య పాలనేనన్నమాట.

వంద శాతం ఆర్గానిక్ సేద్యం

ఇక్కడి జనాభాలో 80 శాతం మంది వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతారు. టూరిజం తర్వాత ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. నూటికి నూరు శాతం ఇక్కడ ఆర్గానిక్ సేద్యమే జరుగుతుంది. ఇదో స్పెషాలిటీ.చలికాలంలో ఇక్కడ పొలం పనులు ఆపేస్తారు. వ్యవసాయానికి  ప్రకృతి సహకరించదు. అసలు ఫుడ్డే దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో  సమ్మర్ సీజన్ లోనే  అవసరమైన ఆహారాన్ని నిల్వ చేసుకుంటారు. భూటాన్ ప్రజల్లో మూడింట రెండు వంతుల మంది బుద్దిజాన్ని ఫాలో అవుతారు. ఒక వంతు ప్రజలు హిందూయిజం అనుసరిస్తారు. ఇక్కడి ప్రజల్లో తక్కువ శాతం మంది నాన్ వెజ్ తింటారు. అయితే మాంసం కోసం జంతువులను చంపడాన్ని నిషేధించారు. ప్రజల  అవసరాలకు తగినంత నాన్ వెజ్ ఫుడ్ ను ఎక్కువగా ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటారు.

చదువు, ఆరోగ్యం బాధ్యత సర్కారుదే

ప్రజల కనీస అవసరాలైన చదువు, ఆస్పత్రి సదుపాయాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ఎవరైనా  ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడితే సర్కారీ దవాఖానాలకు వెళ్లాల్సిందే. కార్పొరేట్ హాస్పిటల్స్ కల్చర్ ఇక్కడ కనిపించదు. ప్లాస్టిక్ బెడద గురించి ప్రపంచంలోని అనేక దేశాలు ప్రస్తుతం గగ్గోలు పెడుతున్నాయి. అయితే భూటాన్ 1999లోనే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించింది. భూటాన్ దేశంలో ఇళ్లన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. చాలా ఇళ్లపై  పులుల బొమ్మలు ఉంటాయి. దెయ్యాలు రాకుండా ఈ పులుల బొమ్మలు అడ్డుకుంటాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. భూటాన్ ప్రజల డ్రస్సు  గమ్మత్తుగా ఉంటుంది. మగవాళ్లు వేసుకునే డ్రస్సును ‘ఖో’ అంటారు. ఆడవాళ్లు సంప్రదాయంగా ‘కిరా’ జాకెట్లను వేసుకుంటారు.  పాత రోజుల్లో భూటాన్ లో టీవీ, ఇంటర్నెట్ సదుపాయాలు ఉండేవి కావు. అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చే టూరిస్టుల అవసరాల కోసం 2001 నుంచి టీవీ, ఇంటర్నెట్ వసతులు అందుబాటులోకి తెచ్చారు.

భూటాన్​లో చూడదగ్గ టూరిస్టు ప్లేసెస్ చాలానే ఉన్నాయి. పురాతన బౌద్ద సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడి ఎన్నో కట్టడాలు ఉన్నాయి. టూరిస్టులను ఇవి ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యూరోప్ దేశాల నుంచి వచ్చే టూరిస్టులు, ఈ కట్టడాలకు బాగా  ఆకర్షితులవుతుంటారు. రాజధాని నగరమైన థింపూలోని బుద్ధుడి విగ్రహం వరల్డ్ ఫేమస్. ప్రపంచంలోనే అతి పెద్దదైన బుద్ధ విగ్రహాల్లో ఇదొకటని చెబుతారు. బ్రాంజ్ తో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఆకాశాన్ని తాకినట్టుండే కొండలు భూటాన్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

నో స్మోకింగ్ జోన్

ఎడాపెడా సిగరెట్లు తాగే పొగరాయుళ్లు భూటాన్​లో కనిపించరు. ఎందుకంటే భూటాన్ పూర్తిగా  ‘నో స్మోకింగ్’ జోన్. 2004లోనే ఇక్కడ టుబాకో ప్రొడక్ట్స్  వాడకాన్ని నిషేధించారు. అన్ని దేశాలు అభివృద్ది పేరుతో ఎడాపెడా అడవులు నరికివేస్తుంటే, భూటాన్ మాత్రం అడవులను కన్నబిడ్డల్లా కాపాడుకుంటోంది. ఇక్కడ చెట్లను కొట్టడం నేరం.

 

స్టాంపులు స్పెషల్ అట్రాక్షన్

భూటాన్ స్టాంపులకు ఓ స్పెషాలిటీ ఉంది. గమ్మత్తయిన  డిజైన్లను స్టాంపులుగా ఇక్కడ ముద్రిస్తారు. రంగురంగుల్లో ఉండే ఈ డిజైన్లు చూసేవాళ్లను బాగా ఆకట్టుకుంటాయి. 1962లో  భూటాన్ తొలి పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. దేశ గొప్పదనాన్ని  ప్రపంచానికి తెలియచేయడానికి  చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి డిజైన్లను పోస్టల్ డిపార్ట్ మెంట్ సెలెక్ట్ చేసుకుంటుంది. బంగారు పూత పూసిన భూటాన్ రాజుల బొమ్మలను స్టాంపులుగా రిలీజ్ చేసే ట్రెండ్ 1966  నుంచి 1968 వరకు నడిచింది. సువాసన వచ్చే రోజ్ స్టాంపులను 1973 లో విడుదల చేసింది.త్రీ డీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ 1967లోనే త్రీ డీ స్టాంపులు విడుదల చేసింది భూటాన్. వీటిపై  ఆస్ట్రోనాట్స్ , లూనార్ మాడ్యూల్స్ బొమ్మలను వేశారు.

 

ట్రాఫిక్ లైట్లు లేని థింపూ సిటీ

భూటాన్ రాజధాని థింపూ నగరానికి ఒక  ప్రత్యేకత ఉంది. థింపూలో ఎక్కడా ట్రాఫిక్ లైట్లు కనిపించవు. ఎందుకంటే రాజధాని నగరంలో ట్రాఫిక్ జామ్ లనే ముచ్చటే ఉండదు. వెహికిల్స్ ను చాలా స్లోగా నడుపు తారు ఇక్కడి ప్రజలు. యాక్సిడెంట్లు చాలా అరుదు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.

 

దేశానికి ఎయిర్ పోర్టు ఒక్కటే..

భూటాన్ లో ఒకేఒక్క ఎయిర్ పోర్టు ఉంది. అదే పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.భూటాన్ నుంచి ఏ దేశానికి వెళ్లాలన్నా పారో ఎయిర్ పోర్టే ఆధారం. గతంలో ఇక్కడ రైల్వే నెట్ వర్క్ కూడా ఉండేది కాదు. అయితే సౌత్ భూటాన్ లో  రైళ్లు ప్రవేశపెట్టాలని అక్కడి సర్కార్ నిర్ణయించుకుని, ఇండియా తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

 

గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్

సహజంగా ఏ దేశ ప్రగతినైనా జీడీపీ ఆధారం గానే నిర్ణయిస్తారు. ఈ విషయంలో భూటాన్ రూటే వేరు. ప్రజలు ఎంత తృప్తిగా బతుకు తున్నారన్నదానికే భూటాన్ పాలకులు  ప్రయారిటీ ఇస్తారు. మంచి పాలన అందించడం, ఉన్నంతలో తృప్తిగా బతకడం, సంప్రదాయాలను పాటించడం తోనే  ప్రజలు హ్యాపీగా ఉంటారని  పాలకులు భావిస్తారు.