
విమానాశ్రయం అనగానే విశాలమైన ప్రదేశంలో పెద్ద అద్దాలతో వినూత్న ఆర్కిటెక్చర్‌తో కనిపిస్తుంది. అయితే ఈ ఎయిర్పోర్ట్ మాత్రం వీటన్నిటితోపాటు ‘ఆహా అద్భుతం!’ అనిపించేలా ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెడితే.. అక్కడి వాతావరణానికి మైమరిచి.. ప్రయాణం గురించి మరచిపోతారేమో! అంటే అతిశయోక్తి కానేకాదు. ఇంతకీ ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలేంటి?
భూటాన్‌లోని గెలెఫు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఈ విమానాశ్రయం ఇండియా బార్డర్‌కి దగ్గరలో ఉంటుంది. దీన్ని గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. దీన్ని 2029లో ప్రారంభించనున్నారు. ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన దీని రూపకర్తలు జర్కే ఇంగెల్స్ గ్రూప్ (బిఐజి). ఎయిర్‌పోర్ట్‌లో సస్టయినబిలిటీ థీమ్ ఆధారంగా మోడర్న్ ఇన్నోవేషన్, భూటానీస్ ట్రెడిషన్స్ కలగలిపి కట్టారు. డయాగ్రిడ్ స్ట్రక్చర్‌లో కనిపిస్తున్న దీన్ని అక్కడ దొరికే టింబర్‌తో కట్టారు. అందులోని భూటాన్ చెక్క శిల్పాలు, డ్రాగన్ మోటిఫ్‌లు, దేశ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తును తెలియజేసేలా సింబాలిక్‌గా ఉంటాయి. ఈ ఎయిర్పోర్ట్ డిజైన్‌లో ఊపిరిలాంటిది సుస్థిరత (సస్టయినబిలిటీ). ఎయిర్పోర్ట్ పైకప్పు సోలార్ ప్యానెల్స్‌తో అమర్చారు. తద్వారా రెన్యువబుల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నేచురల్ వెంటిలేషన్ సిస్టమ్ ఉండడం వల్ల ఆర్టిఫిషియల్ కూలింగ్ అవసరం చాలా తగ్గుతుంది. దీంతో కార్బన్ నెగెటివ్ కంట్రీగా పేరుగాంచిన భూటాన్ ప్రతిష్టకు భంగం కలగదు. ఫారెస్ట్ స్పైన్ కోర్ట్ యార్డ్ ఫీచర్స్ చూస్తే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినల్స్‌కి మధ్య నేచురల్ సపరేటర్గా పనిచేస్తుంది.
ఇక్కడ ఉన్న బహిరంగ ప్రదేశంలో వచ్చే సహజ కాంతి, స్వచ్ఛమైన గాలి అక్కడి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాదు.. మెడిటేషన్, యోగా వంటివి చేయడానికి కూడా ఈ ఎయిర్‌పోర్ట్‌లో చోటు కల్పించింది. ఇలాంటి ప్రదేశాలు రిలాక్సేషన్ని, భూటాన్ లైఫ్ స్టయిల్ ఫిలాసఫీని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇకపోతే ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిరోజూ123కు పైగా విమానాలు పార్క్ చేయొచ్చు. 2040 నాటికి ఏటా1.3 మిలియన్ల ప్యాసెంజర్లకు వసతి కల్పించనుంది. 68000 చదరపు మీటర్లు ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు వీలుగా ఈ డిజైన్ ఉంది. అంతేకాకుండా ఎయిర్ ట్రాఫిక్, పెరిగే ప్రయాణీకుల సంఖ్యలను బట్టి డిజైన్ తదనుగుణంగా ఈజీగా మార్చుకునే వీలుంది.