ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లోని బుద్ధవనాన్ని గురువారం భూటాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలో బౌద్ధ చిహ్నాలు, అశోక ధర్మచక్రం, బుద్ధుడి పాదాలు, బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యానవనంతో పాటు పలు స్థూపాలను పరిశీలించారు. సిద్ధార్థుడి జననం, మహాభినిష్క్రమనం, బుద్ధుడిగా మారడం, ధర్మ చక్రప్రవర్తనం, మహాపరినిర్వాణ శిల్పాలు ఎంతో బాగున్నాయని కమిటీ సభ్యుడు ఉగెన్‌‌‌‌‌‌‌‌ నాంగ్యాల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వారి వెంట బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, కె.సుదన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కె.క్రాంతిబాబు, శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌రావు, ఈమని  వనాగిరెడ్డి ఉన్నారు.


పథకాల అమలులో తెలంగాణే బెస్ట్‌

తుంగతుర్తి, వెలుగు : దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారంలో గురువారం మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ ట్యాంకు, వైకుంఠధామం, పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోందన్నారు. బండరామారం నుంచి గుండెపురికి బీటీ రోడ్డు రిపేర్లకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. అంతకు ముందు మద్దిరాల పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ప్రణీత జయచంద్రారెడ్డి, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ రాంప్రసాద్, జడ్పీచైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ఏ గుజ్జ దీపిక యుగంధర్‌‌‌‌‌‌‌‌రావు, రైతు బంధు అధ్యక్షుడు ఎస్‌‌‌‌‌‌‌‌కే.రజాక్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, గడ్డం ఉప్పలయ్య, ఆకారపు సైదులు, డీసీసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ గుడిపాటి సైదులు, గుండగాని రాములుగౌడ్, కటకం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

దేశభక్తి పెంచుకోవాలి

నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని నల్గొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రేగట్టె మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లిలో నిర్వహిస్తున్న నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం శత దినోత్సవం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బ్లడ్‌‌‌‌‌‌‌‌ డొనేషన్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో 43 మంది రక్తదానం చేశారు. అంతకుముందు అమ్మనబోలు రోడ్డు నుంచి బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వరకు 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ దూదిమెట్ల స్రవంతి, ఎంఈవో కూకుట్ల నరసింహ, ఎంపీడీవో గుండెగోని యాదగిరి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, దుబ్బాక పావని శ్రీధర్, జనగణమన సమితి జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, రెడ్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌ సొసైటీ అధ్యక్షుడు అమరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.


ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్రు

సూర్యాపేట, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి మాట్లాడారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ పారిశుద్ధ్య కార్మికులను మంత్రి, కొందరు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు ఇండ్లలో పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. 50 ఏళ్లు నిండిన ప్రతి గౌడ కార్మికుడికి పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సూర్యాపేటలో నాలాలు ఆక్రమణకు గురికావడంతో చిన్న పాటి వర్షానికి కాలనీలు నీట మునుగుతున్నాయన్నారు. సద్దల చెరువు అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఒక కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ మేలు కోసమే పనులు చేస్తున్నారని విమర్శించారు. 

చోరీలు చేస్తున్న నలుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

మిర్యాలగూడ, వెలుగు : చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ సీఐ రాఘవేందర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంనకు చెందిన డీసీఎం డ్రైవర్‌‌‌‌‌‌‌‌ సట్టి అశోక్‌‌‌‌‌‌‌‌, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగదాస  వనిసిమిరెడ్డి, దీగుంట్ల ఉపేందర్, మునుగంటి గోపి వేర్వేరు కేసుల్లో హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జైలుకు వెళ్లారు. అక్కడ పరిచయమైన నలుగురు జైలు నుంచి బయటకు వచ్చాక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై మిర్యాలగూడ వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ పరిధిలో 4, సూర్యాపేట జిల్లా చిలుకూరు, వేములపల్లి పరిధిలో 2 చోరీలు చేశారు. గురువారం మిర్యాలగూడ వన్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌ సీఐ సుధీర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని ఈదులగూడ చౌరస్తా వద్ద వెహికల్స్‌‌‌‌‌‌‌‌ తనిఖీ చేస్తుండగా రెండు బైక్‌‌‌‌‌‌‌‌లపై వస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా చోరీల విషయం బయటపడింది. వారి వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన బంగారం, 1,100 గ్రాముల వెండి, గ్లామర్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సైలు సుధీర్‌‌‌‌‌‌‌‌, జి.నర్సింహులు, కృష్ణయ్య, హెడ్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుళ్లు పి.వెంకటేశ్వర్లు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. రామకృష్ణను డీఎస్పీ అభినందించారు.

యువత దేశం కోసం పనిచేయాలి

యాదాద్రి, వెలుగు : యువత దేశం కోసం పనిచేయాలని ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అఖిల భారత ప్రచార ప్రముఖ్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ అంబేకర్‌‌‌‌‌‌‌‌ సూచించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో గురువారం జరిగిన నైజాం విముక్తి స్వాతంత్ర్య్ అమృతోత్సవాల్లో ఆయన మాట్లాడారు. చరిత్ర యువతకు తెలియకుండా కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సంస్థానాన్ని పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌లో కలపాలన్న నిజాం ఆలోచనకు తెరదింపి తెలంగాణను విమోచనం చేశారని గుర్తు చేశారు. ఆ పోరాట స్పూర్తితో యువత దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక సమరసత ప్రముఖ్‌ అప్పాల ప్రసాద్‌‌‌‌‌‌‌‌, శ్రీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బేతి కన్నయ్య, శివకుమార్, బండిరాజుల శంకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బియ్యంలో పురుగులు లేకుండా చూడాలి

యాదాద్రి, వెలుగు : మధ్యాహ్న భోజన బియ్యం, కూరగాయల్లో పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్‌‌‌‌‌‌‌‌ రివ్యూ మిషన్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ భూపేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌, లింగయ్య, ప్రసాద్‌‌‌‌‌‌‌‌ సూచించారు. కిచెన్ పరిసరాలు క్లీన్‌‌‌‌‌‌‌‌గా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. యాదాద్రి జిల్లా భువనగిరి, తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని స్కూల్స్‌‌‌‌‌‌‌‌ను గురువారం తనిఖీ చేసి కిచెన్లు, బియ్యం, కూరగాయలను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న మెనూతో పాటు పిల్లలు వయసుకు తగిన ఎత్తు, బరువు ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించారు. అనంతరం యాదాద్రి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతిని కలిసి తమ రిపోర్టును అందజేశారు.

అధికార దుర్వినియోగం చేస్తున్రు

నల్గొండ (చండూరు), వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ విమర్శించారు. నల్గొండ జిల్లా చండూరులో గురువారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏసీబీ, పోలీస్‌‌‌‌‌‌‌‌ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయ పార్టీల మీద కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్రజల్ల లింగయ్య, ఎండీ. షరీఫ్, గంట అంజయ్య, వంగరి శ్రీను, తోకల యాదయ్య, బోడ భిక్షం, నందగిరి కృష్ణ పాల్గొన్నారు.

లారీని ఢీకొట్టిన బైక్‌‌‌‌‌‌‌‌, స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ మృతి

యాదాద్రి, వెలుగు : లారీని వెనుక నుంచి బైక్‌‌‌‌‌‌‌‌ ఢీకొనడంతో ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ చనిపోయాడు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారం వద్ద గురువారం జరిగింది. భువనగిరి రూరల్‌‌‌‌‌‌‌‌ఎస్సై హెచ్‌‌‌‌‌‌‌‌. రాఘవేందర్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా కట్టంగూర్‌‌‌‌‌‌‌‌ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన సోమ వంశీ (19) బీటెక్‌‌‌‌‌‌‌‌ సెకండియర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్నాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి బైక్‌‌‌‌‌‌‌‌పై యాదగిరిగుట్టకు వస్తున్నాడు. ఈ క్రమంలో అనంతారం బ్రిడ్జి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ వంశీని భువనగిరి ఏరియా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించగా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పొందుతూ చనిపోయాడు.

మతం పేరుతో లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర

యాదగిరిగుట్ట, వెలుగు : మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని డీసీసీబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గొంగిడి మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన పలువురు గురువారం యాదగిరిగుట్టలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. బీజేపీ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌దే విజయం అన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గడ్డమీది రవీందర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, బొమ్మలరామారం మండల అధ్యక్షుడు పొలగోని వెంకటేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ గూదె బాల్‌‌‌‌‌‌‌‌నర్సయ్య, చీకటిమామిడి సర్పంచ్‌‌‌‌‌‌‌‌ మచ్చ వసంత శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 


రైతుల సమస్యలు పరిష్కరించాలి

రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ వల్ల రైతుల సమస్యలు ఇంకా పెరిగాయని, వెంటనే పోర్టల్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే పోడు భూముల సమస్య పరిష్కరించాలని, రుణమాఫీ అమలు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. 
– వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌

ర్యాగింగ్‌ చేస్తే కఠిన చర్యలు

కోదాడ, వెలుగు : స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలు సాధించేందుకు కృషి చేయాలని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌ సూచించారు. ర్యాంగింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా అనంతగిరిలోని అనురాగ్ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌పై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ బారిన పడిన వారు మానసిక వేదనకు గురై భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని, ఎవరైనా ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తే ఈ సెల్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ ఎంవీ.శివప్రసాద్‌‌‌‌‌‌‌‌, సీఐలు శివశంకర్, పీఎన్‌‌‌‌‌‌‌‌డీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

‘బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించగానే బీజేపీ వణుకుతోంది’

యాదాద్రి, వెలుగు : టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ మంత్రులపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో గురువారం జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించగానే బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను మించిన హిందువు లేరన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అంటే ఏంటో చెప్పడానికి యాదాద్రి నిర్మాణం ఒక్కటి చాలన్నారు. సమావేశంలో భువనగిరి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ చింతల కిష్టయ్య ఉన్నారు.



మురుగు నీటి శుద్ధి కేంద్రం పరిశీలన

దేవరకొండ, వెలుగు :నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను గురువారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పనులను క్వాలిటీగా చేయాలని సూచించారు. అంతకుముందు దేవరకొండ మండలం కొండభీమనపల్లి ప్రాజెక్ట్, పర్వతరావు చెరువుల నుంచి సాగు నీటిని విడుదల చేశారు. నీటిని పొదుపుగా వాడుకొని పంటలు సాగు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఆలంపల్లి నర్సింహ, కమిషనర్‌‌‌‌‌‌‌‌ వెంకటయ్య, వేముల రాజు, వడ్త్య దేవేందర్, పొన్నెబోయిన సైదులు, మూడావత్‌‌‌‌‌‌‌‌ జయప్రకాశ్‌‌‌‌‌‌‌‌ నారాయణ, కడారి తిరుపతయ్య, బొడ్డుపల్లి కృష్ణ, ఎండి తౌఫిక్‌‌‌‌‌‌‌‌ ఖాద్రి, జింకల లింగయ్య పాల్గొన్నారు.


సూర్యాపేట, వెలుగు : మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ, సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సూర్యాపేటలో గురువారం మీడియాతో మాట్లాడారు. మిల్లర్ల అక్రమాలపై న్యాయపోరాటానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రైతుల నుంచి వడ్లు కొనకుండానే నకిలీ ట్రక్‌‌‌‌‌‌‌‌షీట్లు సృష్టించి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లాలో వడ్ల అక్రమాలపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌, ఎస్పీలతో టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి విచారణ వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. సీఎంఆర్‌‌‌‌‌‌‌‌ అక్రమాల్లో జిల్లా ఆఫీసర్లకు కూడా వాటాలు ఉన్నాయన్నారు. రూల్స్‌‌‌‌‌‌‌‌ ప్రకారం లెవీ ఇవ్వని మిల్లులను బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెట్టాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. రాజకీయ నాయకుల అండ ఉన్న మిల్లులకు ఎలాంటి రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటించకుండానే వడ్లు కేటాయించారన్నారు. వడ్ల కేటాయింపుల వెనుక మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తుంగతుర్తి ఎమెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌ హస్తం ఉందని ఆరోపించారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన ఆహార పాలసీలతో రైతులకు మద్దతు ధర లభిస్తోందని, విదేశీ విధానాలతో పత్తికి రికార్డ్ స్థాయిలో ధర పలుకుపోందన్నారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు. సమావేశంలో మమతా రెడ్డి, రాపర్తి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్,  కాపా రవి పాల్గొన్నారు. 


బావిలో పడి రైతు మృతి

హాలియా, వెలుగు : మోటార్‌‌‌‌‌‌‌‌ను బయటకు తీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాలో గురువారం జరిగింది. ఎస్సై పెదపంగ బాబు తెలిపిన వివరాల ప్రకారం... తూటిపేటకు చెందిన ఆంగోతు చిన్న హేమ్లా (65) వ్యవసాయ బావి వద్ద మోటార్‌‌‌‌‌‌‌‌ పనిచేయకపోవడంతో దానిని బయటకు తీసేందుకు కొడుకు బంగారు బాబుతో కలిసి బావి వద్దకువెళ్లాడు. హేమ్లా బావిలోకి దిగగా అతడి కొడుకు బావిపైన నిలబడ్డాడు. మోటార్‌‌‌‌‌‌‌‌ పైప్‌‌‌‌‌‌‌‌ను తీస్తుండగా హేమ్లా నీటిలో పడి చనిపోయాడు. మృతుడి కొడుకు బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.