
- వరల్డ్ హ్యాపీనెస్ డే సాధన ఘనత భూటాన్దే: యూజీసీ మాజీ చైర్మన్ ఎస్‌కే తోరట్
భూటాన్: మానవాభివృద్ధికి సంతోషమే అసలైన కొలమానమని నిర్వచించి, మార్చి 20న వరల్డ్ హ్యాపీనెస్ డే కోసం ఐక్యరాజ్య సమితిని ఒప్పించిన ఘనత భూటాన్ ప్రభుత్వానికి దక్కుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్ ఎస్‌కే తోరట్ అన్నారు. అసోసియేషన్ ఆఫ్ బుద్దిస్టు టూరిస్ట్ ఆపరేటర్స్ (ఏబీటీఓ), బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్‌ఐ) ఆధ్వర్యంలో గురువారం భూటాన్ రాజధాని థింపులో ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌కే తోరట్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు పశ్చిమదేశాలు మానవ అభివృద్ధికి అనుసరించిన ఆర్థిక విధానాలకు భూటాన్ ప్రాతిపాదించిన ‘హ్యాపీనెస్ ఇండెక్స్’ పూర్తిగా భిన్నమైందన్నారు.
అంతకుముందు సంపద మాత్రమే మానవ అభివృద్ధిలో ప్రధాన భాగంగా ఉండేదని, కానీ భూటాన్ చెప్పిన హ్యాపీనెస్ ఇండెక్స్, మానవ అభివృద్ధిని పట్టించుకుందని పేర్కొన్నారు. ఏబీటీవో అంతర్జాతీయ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. 8 లక్షల జనాభా కలిగిన భూటాన్ 800 కోట్ల జనాభా కలిగిన ప్రపంచానికి సంతోషంగా జీవించడం ఎలాగో మార్గదర్శనం చేసిందన్నారు. బుద్దిస్టు పర్యాటక రంగ అభివృద్ధికి, బుద్దిజం వ్యాప్తికి బుద్దిస్ట్ దేశాలు, సంఘాలతో కలిసి కృషి చేస్తామని చెప్పారు.
ప్రపంచంలో మొదటిసారి భూటాన్‌లో సదస్సు నిర్వహించుకునే అవకాశం కల్పించిన భూటాన్ రాజుకి, ఇక్కడి సంఘ సభ్యులకు కృతజ్ఞతలు ఆయన తెలిపారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత మండలి మాజీ చైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి, భూటాన్‌లోని ఎన్‌ఆర్‌సీ విద్యాసంస్థల అధ్యక్షుడు ఖుంజాగ్ దృక్ప, బీఎస్‌ఐ జాతీయ అధ్యక్షుడు చంద్రబోధి పాటిల్, రాష్ట్ర అధ్యక్షుడు పరందములు, పలువురు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.