యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం వలిగొండ, భువనగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుల కోసం వైఎస్‌రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు బీఆర్ఎస్ గండికొట్టిందని మండిపడ్డారు. దీంతో విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని వాపోయారు.
ఉద్యోగావకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయ్యిందని, నోటిఫికేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి లీకేజీలతో నిరుద్యోగులను ఆగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీఆర్ఎస్కు చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ చేరారు. కాగా, కుంభం అనిల్‌రెడ్డి కూతురు కీర్తి రెడ్డి భువనగిరిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.