ఆర్థిక సాయం కోసం సిఫార్సు చేస్తా: భవ్య, వైష్ణవి పేరెంట్స్ కు కలెక్టర్​ హామీ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి  ఎస్సీ వెల్ఫేర్​ హాస్టల్​లో  ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ల కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే బాధిత కుటుంబాలను  కలెక్టరేట్​కు పిలిపించి  స్వయంగా కలెక్టర్​ మాట్లాడారు. త్వరలో వారి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.   హాస్టల్​లో  టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​ భవ్య, వైష్ణవి ఫిబ్రవరి 3న ఆత్మహత్య చేసుకున్నారు.   అప్పట్లో పేరెంట్స్​తో కలిసి స్టూడెంట్స్​ యూనియన్స్​ ఆందోళన చేయగా..  ఆర్ధిక సాయం చేస్తామని,  ఔట్​ సోర్సింగ్​ పద్దతిలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారు. ఇప్పటికీ  హామీ అమలు కాకపోవడంతో  పేరెంట్స్​ఇటీవల హైదరాబాద్​లో సీఎం  గ్రీవెన్స్​ సెల్​కు  ఫిర్యాదు చేశారు.   సీఎం గ్రీవెన్స్​సెల్​ నుంచి వచ్చిన ఆదేశాలతో   భవ్య, వైష్ణవి పేరెంట్స్​ను కలెక్టర్​ హనుమంతు  జెండగే పిలిపించారు.

 ఇక్కడికి వచ్చిన పేరెంట్స్​ కృష్ణ, నాగరాజు కలెక్టర్​, డీసీపీని వేర్వేరుగా కలిశారు.  తమ ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, కూతుర్ల ఆత్మహత్యతో  మానసికంగా  దెబ్బతిన్నామని కృష్ణ, నాగరాజు కలెక్టర్ కు  వివరించారు. వారినే తలుచుకుంటూ   కూలికి కూడా వెళ్లలేకపోతున్నామని వాపోయారు.  తాము బతుకుదెరువుకోసం వెళ్లిన సికింద్రాబాద్​లో ఉండలేమని,   తమ సొంతూళ్లకు వెళ్లిపోతామన్నారు.   తమకు ఏదైనా పని ఇప్పించాలని కోరారు.  ఆర్ధిక సాయం కోసం ప్రభుత్వానికి సిఫార్సు  చేస్తామని కలెక్టర్ తెలిపారు. వారి  సొంత  జిల్లాల్లో  ఏదైనా డిపార్ట్​మెంట్​లో   ఔట్​ సోర్సింగ్​, కాంట్రాక్ట్​  ఉద్యోగాలు ఖాళీగా ఉంటే  అక్కడి అధికారులకు రికమండ్​ చేస్తానన్నారు.  పిల్లల ఆత్మహత్యలో  ఎలాంటి అనుమానాలు లేవని యాదాద్రి డీసీపీ రాజేశ్​ చంద్ర తెలిపారు.  తనను కలిసిన భవ్య, వైష్ణవి పేరేంట్స్​తో ఆయన మాట్లాడారు.   అన్ని రిపోర్టులు సరిగానే వచ్చాయన్నారు.