నల్గొండ జిల్లా రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారు

నల్గొండ జిల్లా రైతాంగానికి నష్టం కలిగించేలా సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. SLBC టన్నెల్ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో నెంబర్ 246 విడుదల చేశారని, దీని వల్ల నల్గొండ జిల్లా ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని మండిపడ్డారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ జిల్లా ప్రజలకు SLBC టన్నెల్ ప్రాజెక్టు ద్వారా 45 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయని చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. SLBC టన్నెల్ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 246 తీసుకొచ్చిందన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజల మధ్య సీఎం కేసీఆర్ కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

కృష్ణా నది నుండి ఏపీ సీఎం వైఎస్ జగన్ రోజుకు 8 నుండి 11 టీఎంసీల నీటిని తోడుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల కెనాల్స్ బాగానే ఉన్నాయని, తమ వద్ద ఉన్న కెనాల్స్ లైనింగ్ పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే జీవో నెంబర్ 246ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ జీవో నెంబర్ 246ని రద్దు చేయకపోతే.. నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్ష చేస్తానని హెచ్చరించారు. 246 జీవో రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని చెప్పారు. అవసరమైతే అపాయింట్ మెంట్ తీసుకుని సీఎం కేసీఆర్ ను కలుస్తానని చెప్పారు. SLBC టన్నెల్ కు 30టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 20 టీఎంసీలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులు, ప్రజల మధ్య గొడవలు జరిగితే దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.