భువనగిరి కౌన్సిల్​ మీటింగ్​ వాయిదా

యాదాద్రి, వెలుగు: ఎజెండా అంశాలపై ప్రతిపక్షాలు ఓటింగ్​కు పట్టుబట్టడంతో భువనగిరి మున్సిపాలిటీ సాధారణ సమావేశం వాయిదా పడింది. మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ సాధారణ సమావేశం నిర్వహించారు.బీజేపీ, కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్లు మాయ దశరథ, పోత్నక్​ ప్రమోద్​కుమార్​ మాట్లాడుతూ ఎజెండాపై ఫ్లోర్​లీడర్ల మీటింగ్​ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పైగా కొన్ని అంశాలకు కలెక్టర్​ ఆమోదం అని పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్​ ఆమోదమే అనుకుంటే ఇక కౌన్సిలర్లు ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటు చేసిన లైబ్రరీకి మున్సిపాలిటీ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయాలంటూ పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన టాక్స్​తో వార్డుల్లో డెవలప్​మెంట్​ వర్క్స్​ చేయాలని, లైబ్రరీకి ఖర్చు చేయాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే పట్టణ ప్రగతి సహా ఇతర నిధులను ఖర్చు చేయాలని సూచించారు.

అదే విధంగా ఎజెండాలో పేర్కొన్న 54 అంశాలపై పూర్తిగా చర్చించాలన్నారు. ప్రతి అంశంపై ఓటింగ్​ జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో అరకొర కౌన్సిలర్లతో నెట్టుకొస్తున్న అధికార పక్షం ఇరుకునపడింది. ఓటింగ్​ నిర్వహిస్తే స్వపక్షంలో వ్యతిరేకంగా ఉన్న కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్షాల కౌన్సిలర్లు వ్యతిరేకిస్తూ వీగిపోవడం ఖాయమని, మీటింగ్​ నిర్వహించి పరువు పోగొట్టుకోవడం ఎందుకుని అధికార బీఆర్​ఎస్ ఓ అంచనాకు వచ్చింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు మున్సిపల్​చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు ప్రకటించారు.