యాదగిరిగుట్ట, వెలుగు : బాలికను రేప్ చేసిన కేసులో ఓ నిందితుడికి భువనగిరి కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. యాదగిరిగుట్ట టౌన్ సీఐ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా మోటకొండూర్ కు చెందిన పన్నీరు కల్యాణ్(28) వంగపల్లిలోని ఓ అనాథాశ్రమంలో వాచ్ మెన్ గా పనిచేస్తూ జీవిస్తుండేవాడు. ఈ క్రమంలో 2019లో ఆశ్రమంలో ఉంటున్న అనాథ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆశ్రమ నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు కల్యాణ్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
కేసు విచారణలో భాగంగా మంగళవారం భువనగిరి కోర్టు నిందితుడికి 25 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.2 వేల ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాలిక సంరక్షణార్థం బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.