‘బూర’ ముందు సవాళ్లెన్నో..!  

  •    మూడు ఎన్నికల్లో ఓడిన బీజేపీ
  •     అసెంబ్లీ ఎన్నికల్లో ఫూర్​రికార్డ్​
  •     మోదీ, రాముడిపైనే ఆశ
  •     గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్​

యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్​సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య ఎదుట ఎన్నో సవాళ్లు ఉన్నాయి. పార్టీ సీనియర్లు సహకరించకపోవడం, ఉన్న క్యాడర్​మధ్య సమన్వయం లేకపోవడం బీజేపీని ఇబ్బందుల్లో నెడుతోంది. భువనగిరి లోక్​సభలో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ.. ఈసారి మోదీ, రాముడిపై ఆశతో ముందుగు సాగుతోంది. 

మూడుసార్లూ తప్పని ఓటమి.. 

2009లో ఏర్పడిన భువనగిరి లోక్​సభ స్థానం రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, జనగామ జిల్లాల్లోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ నియోజకవర్గాల్లో విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ స్థానం ఏర్పడినప్పటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోయింది. ఓట్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. 2009లో జరిగిన మొదటి లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున చింతా సాంబమూర్తి పోటీ చేసి 4.1 శాతం (45,808) ఓట్లు సాధించారు. కాంగ్రెస్​ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి గెలిచారు.

తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి (ప్రస్తుతం త్రిపుర గవర్నర్)  పోటీ చేసి 15.1 శాతం (1,82,817) ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్​నుంచి బూర నర్సయ్యగౌడ్​ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పీవీ శ్యాంసుందర్​రావు పోటీ చేసి 5.4 శాతం (65,222) ఓట్లు సాధించారు. కాంగ్రెస్ నుంచి మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలిచారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో పూర్​ రికార్డ్.. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఓట్లు రాలేదు. భువనగిరి లోక్​సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లను చూసి ఆ పార్టీ కార్యకర్తలు ఢీలా పడిపోయారు. తుంగతుర్తి నియోకవర్గంలో అతి తక్కువగా 4,412 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో నకిరేకల్​లో 5,668, జనగామలో 7,734, భువనగిరిలో 9,200, ఆలేరులో 9,659, ఇబ్రహీంపట్నంలో 15,790, మునుగోడులో 22,319 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఏడు నియోజకవర్గాల్లో కలిసి 4.9 శాతం (74,782) ఓట్లు వచ్చాయి. అయితే, 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్లు కొంత పెరిగాయి. 

క్యాడర్​ అంతంతే..  

భువనగిరి లోక్​సభ పరిధిలో బీజేపీకి క్యాడర్​అంతంత మాత్రమే ఉంది. ఉన్న క్యాడర్​లో కూడా సమన్వయం లేదు. లోక్​సభ టికెట్ ఆశించినా రాకపోవడంతో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు ఈవైపునకే రావడం లేదు. గత ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసినా గూడూరు నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కన్పించడం లేదు. వీటన్నింటినీ ఎదుర్కొని బూర నర్సయ్య ముందుకు సాగాల్సి ఉంది. 

మోదీ, రాముడిపైనే ఆశ..

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా నిరాశ కలిగించినా.. లోక్​సభ ఎన్నికలపై  బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇటీవల అయోధ్యలో రామాలయం ప్రారంభం కావడంతో ఎన్నికల ప్రచారంలో అదే అంశానికి ప్రియారిటీ ఇస్తోంది. ఈ ఎన్నికల్లో పూర్తిగా మోదీ, రాముడితోపాటు జాతీయ అంశాలనే ప్రస్తావిస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 74,782 మాత్రమే. ఇప్పుడా ఆ పార్టీ గెలవాలంటే గతంలో వచ్చిన ఓట్లను కలుపుకొని 4.50 లక్షల ఓట్లకు పైగా సాధించాల్సి ఉంటుంది. అన్ని లక్షల ఓట్లను మోదీ, శ్రీరాముడి అంశాలు ఈవీఎంలో కురిపిస్తాయా..? అన్నది చూడాలి. 

గెలుపు ప్రతిష్టాత్మకం..

కాంగ్రెస్​లో భువనగిరి సీటు కోమటిరెడ్డి బ్రదర్స్​కు రాకపోవడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావించింది. కోమటిరెడ్డి బ్రదర్స్​ఇటువైపు ప్రచారానికి కూడా రారని అంచనా వేసింది. భువనగిరి ఇన్​చార్జిగా బాధ్యతలు చేపట్టిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలా పర్యటిస్తున్నారు. అభ్యర్థి చామల కిరణ్​కుమార్ రెడ్డిని తన తమ్ముడని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్​ సీరియస్​గా పని చేస్తుండడంతో బీజేపీలో నిరాశ నెలకొంది.