- కాంగ్రెస్ నుంచి రెడ్డిలు
- బీఆర్ఎస్, బీజేపీ నుంచి బీసీలు
- గెలుపు ధీమాలో కాంగ్రెస్
- బీసీలపై బీజేపీ చూపు
- ఉత్సాహం లోపించిన బీఆర్ఎస్
యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ వర్సెస్ రెడ్డిగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బీసీ క్యాండిడేట్లు బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి రెడ్డి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకే టికెట్లు ఇస్తాయని ప్రచారం జరిగింది. బీసీల్లోని గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్యగౌడ్‌ను బీజేపీ ఎంపిక చేసింది. బీఆర్ఎస్ కూడా రెడ్డి సామాజిక వర్గానికే చెందిన వారికి టికెట్ఇవ్వడానికి ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తిరస్కరించారు.
చివరకు బీసీల్లోని మరో ప్రధాన సామాజిక వర్గమైన కురుమ కులానికి చెందిన క్యామ మల్లేశ్‌కు బీఆర్ఎస్ టికెట్‌ఇచ్చింది. బీసీ సామాజిక వర్గాల్లోని రెండు ప్రధాన కులాలకు బీజేపీ, బీఆర్ఎస్టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్‌కూడా కొంత ఆలోచించింది. చివరకు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా పేరున్న చామల కిరణ్కుమార్రెడ్డినిఎంపిక చేశారు. దీంతో భువనగిరి లోక్‌సభ పరిధిలో ఓట్ల సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.
గెలుపు కోసం కాంగ్రెస్..
భువనగిరి లోక్‌సభకు మూడుసార్లు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ రెండుమార్లు గెలిచింది. నాలుగోసారి జరుగుతున్న ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో ఆరింటిలో బీఆర్ఎస్అభ్యర్థులు గెలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి కాంగ్రెస్అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలిచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ మినహా ఆరింటిని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది. బీసీలు, ఎస్సీలు, ఓసీ, మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉండడంతో గెలుపు ఖాయమని పార్టీ భావిస్తోంది.
బీసీలపై బీజేపీ ఆశ..
2009, 2019 ఎన్నికల్లో నామమాత్రపు ఓట్లు సాధించిన బీజేపీ.. 2014లో మాత్రం భారీగా ఓట్లు సాధించింది. నాడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లు ఇంద్రసేనారెడ్డి ( ప్రస్తుత త్రిపుర గవర్నర్) 1.82 లక్షల ఓట్లు సాధించారు. ఈ కారణంగానే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. జాతీయ స్థాయిలో దూకుడుగా ఉన్న బీజేపీ, ఈసారి వ్యూహాత్మకంగా భువనగిరి లోక్‌సభ స్థానంలో బీసీల్లో మెజార్టీ ఓట్లున్న గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను బరిలోకి దింపింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏడు నియోజకవర్గాలు కలిపి మొత్తంగా 74 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, నియోజకవర్గంలో బీసీలోని ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఓట్లతోపాటు గౌడ సామాజిక వర్గం ఓట్లు తమకే వస్తాయని బీజేపీ ఆశిస్తోంది.
ఉత్సాహం లోపించిన బీఆర్ఎస్..
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 2014లో బీఆర్ఎస్ గెలిచింది. 2019 ఎన్నికల్లో భారీ ఓట్ల తేడాతో కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో క్యాండిడేట్ఎంపికలోనే బీఆర్ఎస్తడబడింది. టికెట్ఇస్తామన్నా నాయకులు పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోకవర్గానికి చెందిన క్యామ మల్లేశ్‌కు బీఆర్ఎస్టికెట్ ఇచ్చింది.
బీసీ సామాజకవర్గాల్లోని కురుమ, యాదవ కులాలకు చెందిన ఓట్లు నియోజకవర్గంలో క్రియాశీలకంగానే ఉన్నాయి. పెద్ద సామాజివ వర్గానికి చెందిన క్యాండిడేట్అయినప్పటికీ బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూసి ఆ పార్టీ నాయకులే ఇతర పార్టీలో చేరుతున్నారు.
బీసీ ఓట్ల చీలికపై ఆశలు
ప్రభుత్వ అనుకూలతతోపాటు బీసీ ఓటర్ల చీలికపై కాంగ్రెస్ ఆశలున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులు ఇద్దరు ప్రధాన సామాజిక వర్గాలైన గౌడ, కురుమ కులాలకు చెందినవారు ఉన్నారు. ఈ రెండు కాకుండా ఈ నియోజవర్గంలో పద్మశాలి, ముదిరాజ్ కులాల ఓట్లు పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. అయితే, అభ్యర్థి కులానికి చెందిన వ్యక్తి అయినంత మాత్రాన లోక్‌సభ ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు వేస్తారని చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. 50 శాతానికి మించిన బీసీలు ఏ ఒక్కపార్టీ వైపు చూసే పరిస్థితులు లేవు. ఈ పరిణామాలే తమకు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ ఆశిస్తోంది.