యాదాద్రి, వెలుగు : మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ముందుకే వెళ్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వలిగొండ మండలం సంగెంలోని భీమలింగం స్వామిని ఆయన దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. భీమలింగేశ్వరుడికి రూ. 2 కోట్లతో ఆలయం నిర్మిస్తానని ప్రకటించి మాట్లాడారు. మూసీ కాలుష్యం, సుందరీకరణ, పునరుజ్జీవంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. మూసీలోకి స్వచ్ఛమైన జలాలు ప్రవహించాలనే తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు.
అనంతరం బ్రిడ్జీ నిర్మాణం, ఇతర డెవలప్మెంట్ వర్క్స్‌పై ఇరిగేషన్, ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. వలిగొండ మండలం రెడ్లరేపాకలో నిర్మించే ఇంటిగ్రేటేడ్ స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. చందుపట్ల పీఏసీఎస్‌లో రైతులకు రుణమాఫీ జరగని అంశంపై నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
సాంకేతిక సమస్యలను అధిగమించి, రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. బస్వాపురం రిజర్వాయర్ కోసం మునిగిపోతున్న బీఎన్ తిమ్మాపురంలో స్టక్చర్ వ్యాల్యూపై రివ్యూ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ. 50 కోట్లు వచ్చాయని, మిగిలిన సొమ్ము కూడా విడుదల చేయించి.. నిర్వాసితులకు పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే కుంభం తెలిపారు.