యాదాద్రి, వెలుగు : పేదల సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు అర్హులైనవారికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ను కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి మొబైల్ యాప్ లో నమోదు చేయాలని అధికారులకు చెప్పారు.
ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.5 లక్షల మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదయ్యేలా చూడాలన్నారు. రేపు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో నూతన డైట్ కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తామని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు విజయవంతంగా నిర్వహించారని, అదే స్ఫూర్తితో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను చేపట్టాలని సూచించారు. కార్యక్రమం హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూట ఈఐఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హౌసింగ్ శ్రీరాములు, మండల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.