టూరిజం స్పాట్‌‌గా భూదాన్ పోచంపల్లి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, వెలుగు : భూదాన పోచంపల్లిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక టూరిజం పార్కులో మున్సిపాలిటీ, మండల అభివృద్ధిపై అధికారులతో రివ్యూ మీటింగ్‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గత ప్రభుత్వంలో పోచంపల్లి పెద్ద చెరువును మినీ ట్యాంక్‌‌ బండ్‌‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మరిపోయారని మండిపడ్డారు.  

పోచంపల్లికి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి చీరలు కొనేందుకు వస్తుంటారని, అయితే సరైన వసతుల లేక వారు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.  కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.  మున్సిపాలిటీ కేంద్రంతో పాటు గ్రామాల్లో పెండింగ్‌‌లో ఉన్న సీసీ రోడ్లు

అండర్ గ్రౌండ్‌‌ డ్రైనేజీ  పనులను త్వరగా పూర్తిచేస్తామన్నారు.  అనంతరం అధికారులతో కలిసి పెద్ద చెరువును పరిశీలించి.. త్వరలోనే  మినీ ట్యాంక్ బండ్‌‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్‌‌ చైర్మన్  విజయలక్ష్మి, తహసీల్దార్ , ఎంపీడీవో, ఇతర అధికారులు ఉన్నారు.