చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తాం 

చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తాం 
  • భువనగిరి ఎమ్మెల్యే కుంభం 

యాదాద్రి, వెలుగు : చెరువుల్లోని ఆక్రమణలను గుర్తించి తొలగిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి తెలిపారు. భువనగిరిలోని మూడు మండలాలు హెచ్​ఎండీఏ పరిధిలో ఉన్నందున ఇక్కడకు కూడా హైడ్రా వస్తదని చెప్పారు. చెరువుల ఎఫ్​టీఎల్, బఫర్​జోన్లను గుర్తించి హద్దులు నాటేందుకు సర్వే కొనసాగుతుందన్నారు. గురువారం నియోజకవర్గంలోని బీబీనగర్​ చెరువు మరమ్మతు పనులు, బునాదిగాని కాల్వ, బొల్లేపల్లి కాల్వలను ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

బీబీనగర్​చెరువును సుందరీకరిస్తామని చెప్పారు. బీబీనగర్ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్నందున చెరువును మినీ ట్యాంక్​బండ్​గా మారుస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన ఎస్టిమేట్స్​రూపొందించాలని ఆఫీసరులకు సూచించారు. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రాఘవుపురం వద్ద బునాదిగాని కాల్వలో పెరిగిన గుర్రపు డెక్కను తొలగించే పనులను పరిశీలించారు.

సీనాతండ వద్ద బొల్లేపల్లి కాల్వను పరిశీలించిన ఆయన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. చెరువు, కాల్వల ద్వారా సాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని, బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వలను పూర్తి చేయిస్తానని చెప్పారు. లోలెవల్ వంతెనలు ఉన్నచోట బ్రిడ్జీలను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.