- బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్
తుంగతుర్తి, మోత్కూరు, వెలుగు : కాంగ్రెస్ ఖాళీ కుండ, బీఆర్ఎస్ పగిలిపోయిన కుండ అని బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. బీజేపీ మాత్రం నిండు కుండ అని, రాష్ట్రం బాగుండాలంటే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బోర్లు, పంటలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ అంటనే కరువని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌తో బీజేపీకి సంబంధం లేదని, అదంతా ఈడీ, ఐటీ చూసుకుంటాయని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేసి ఇప్పుడు ఫీజులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించారు. పదేళ్ల మోడీ పాలనలో రూపాయి అవినీతి జరగలేదని, వెల్ఫేర్, డెవలప్ మెంట్‌ను సమంగా నడిపిస్తున్నారని స్పష్టం చేశారు.
మోదీ దేశంలో 4 కోట్ల ఇండ్లు కట్టించారని, అవాస్ యోజనను తెలంగాణలో కేసీఆర్ అమలు చేయకపోవడంతో పేదలకు ఇండ్లు రాలేవన్నారు. భువనగిరి కోట డెవలప్‌మెంట్‌కు రూ.60 కోట్లు మంజూరు చేయించామని, తన హయాంలోనే బీబీనగర్ ఎయిమ్స్, ఇండస్ట్రియల్ పార్క్, జనగాం ఎంసీ హెచ్ వంద పడకల ఆస్పత్రి, ఎంఎంటీఎస్, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు వచ్చాయని చెప్పారు. అనంతరం తిరుమలగిరిలో వివిధ కుల సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. అంతకు ముందు పొడిచేడు
పాలడుగు, పనకబండ గ్రామాలకు చెందిన పలు పార్టీల కార్యకర్తలు నర్సయ్యగౌడ్ సమక్షంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, నేతలు కడియం రామచంద్రయ్య , లీడర్లు బందారపు లింగస్వామి, మలపక సాయి బాబా, దీన్ దయాల్, ఝాన్సీ రెడ్డి, యాదగిరి, వెంకన్న నరేశ్, లింగయ్య, కూరాకుల వెంకన్న, గౌరు శ్రీనివాస్, బొట్టు అబ్బయ్య, దీటి సందీప్, పోచం సోమయ్య, మరాటి అంజయ్య, ఆరె శ్రీనివాస్, చాడ మంజుపాల్గొన్నారు.