మూసీ వాస్తవ పరిస్థితిని తెలుసుకోండి:ఎంపీ చామల

  • మురికి నుంచి ప్రజలు విముక్తి పొందాలి
  • మూసీ ప్రక్షాళనకు సహకరించండి
  • భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకే బీజేపీ బస్తీ నిద్రకు పలుపునిచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. అక్కడి ప్రజలతో కలిసి నిద్రించి, వారితో భోజనం చేసి యోగక్షేమాలు తెలుసు కుని వస్తే తప్పు లేదని.. కానీ ప్రభుత్వం కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవద్దన్నారు.

ప్రధాని మోదీ సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేసినప్పుడు మీరు ఎలాగైతే సహకరించారో.. ఈరోజు మూసీ ప్రక్షాళనకు కూడా సహకరించాలని కోరారు. దక్షిణ భారతదేశాన్ని కూడా గుజరాత్ మోడల్ లాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మురికి నుంచి ప్రజలు విముక్తి పొందాలన్నారు.


మూసీపై రాజకీయం చేయొద్దు –భువనగిరి ఎమ్మెల్యే కుంభం 

హైదరాబాద్: మూసీపై బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ నడుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ‘కిషన్ రెడ్డి .. మా ఛాలెంజ్ ఒక నైట్ కాదు మూడు నెలలు. మూసీ అనేక వర్గాల సమస్య.. దశాబ్దాల నుంచి మూసీ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. దీనిపై బీజేపీ రాజకీయం చేయొద్దు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల ను కేటాయిస్తున్నం. సబర్మతి కోసం మీ ప్రభుత్వం వేలాది మందిని ఖాళీ చేయించలేదా? ఢిల్లీలో ప్రధాని మోదీ ఇంటి ముందు కిషన్ రెడ్డి పడుకొని మూసీ ప్రక్షాళనకు నిధులు తీసుకురావాలి’ అని సూచించారు.