- మూసీ పరీవాహక పేదలు మోసపోవద్దు
- సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నరని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావును నమ్ముకుంటే గతంలో శ్రీకాంత చారిలాగా బలైపోవుడే అని మూసీ పరివాహక ప్రాంత పేదలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అప్రమత్తం చేశారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు అగ్గిపెట్టె పట్టుకొని తిరుగుతుండని, ఏదో ఒకటి చేసి అధికారంలోకి రావాలని స్కెచ్ వేశాడని ఆరోపించారు. ఆయన చిల్లర మాటలు నమ్మి పేదలు మోసపోవద్దని కోరారు. బావా, బామ్మర్దులు సినీ యాక్టర్లను మించి నటిస్తూ, ప్రజల్ని నమ్మించేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్యలు.. ఉమ్మడి నల్గొండ జిల్లాను సర్వనాశనం చేశారని రేపటి నుంచి జిల్లాలో తిరిగితే వారిని చెట్టుకు కట్టేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా మూసీలో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూల్చివేయాలని దానికి మీడియా, ప్రజలు సహకరించాలని అసెంబ్లీ సాక్షిగా కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారం పోగానే ఆ పార్టీ మాటా మార్చిందని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన చేస్తే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు విష ప్రచారం సాగిస్తున్నారని ఆరోపించారు.