- డిసెంబర్లో సర్కార్ ఏర్పాటు
- ఉమ్మడి జిల్లాలో సభలు,రోడ్ షోలు
యాదాద్రి, వెలుగు : ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 80కిపైగా సీట్లు గెలుస్తుంది. డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడుతుంది’ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ సీఎం ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తారని ఆయన తెలిపారు. గురువారం యాదాద్రి జిల్లాలో రోడ్‌షోలు, సభలు నిర్వహించి, భువనగిరిలో ప్రెస్మీట్లో , ఆలేరులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో మాట్లాడారు.
తెలంగాణ సంపదను దోచుకుంటూ నియంతగా పాలిస్తున్న కేసీఆర్ సర్కార్‌కు ఈ ఎన్నికలతో చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆలేరు, భువనగిరిలో బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి గెలుస్తారని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడగానే.. ఎయిమ్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు. బీర్ల అయిలయ్య గెలిస్తే.. తాను సీఎం అయినట్టే అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20 లేదా 21న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటిస్తారని ఆయన తెలిపారు.
నల్గొండ,భువనగిరిలో రోడ్ షోలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు. భువనగిరి, ఆలేరులోనూ ఆయన ప్రచారం ఉంటుందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో తీన్మార్ మల్లన్న , కసిరెడ్డి నారాయణరెడ్డి, సీపీఐ లీడర్ గోదా శ్రీరాములు, ఆకవరం మోహన్‌రావు, వంచవీరారెడ్డి ఉన్నారు.