- సంప్రదాయ ఓటుతో పాటు రూరల్‌పై కాంగ్రెస్ ధీమా
- యూత్, అర్బన్ ఓటు తమదే అంటున్న బీజేపీ
- సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్
యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్‌సభ స్థానంపైనే ఉంది. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ పెరిగి 76.78 శాతం నమోదు కావడంతో స్టేట్‌లోనే నెంబర్ వన్‌గా నిలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరున్న చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్‌గా పోటీ చేశారు. ఇన్చార్జిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నీ తానై నడిపించారు. ఈ స్థానంలో బీజేపీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ తరపున మాజీ సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. పోలింగ్ శాతం పెరగడం తమకే కలిసి వస్తుందని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ ఈ స్థానంలో విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గెలుపుపై కాంగ్రెస్ ధీమా..
భువనగిరిలో గెలుపుపై కాంగ్రెస్ ధీమాతో ఉంది. 2009లో ఏర్పడిన ఈ స్థానంలో 2019 వరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా, రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఈసారి తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడం కలిసి వచ్చే అంశమని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. ఇప్పటికే అమలు చేసిన మహిళలకు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ పెంపుతో పాటు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంశాలు కలిసి వస్తాయని అంటున్నారు. ఆగస్టులో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని రైతులు విశ్వసించారని చెబుతున్నారు. అదే విధంగా చేయి గుర్తు కన్పిస్తే చాలు అభ్యర్థితో సంబంధం లేకుండా కాంగ్రెస్‌కు వేసే సంప్రదాయ ఓటుతో పాటు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారని భావిస్తున్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ బీజేపీ చేసిన ప్రచారం కారణంగా నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల ఓట్లు చీలకుండా గంపగుత్తగా పడ్డాయని చెబుతున్నారు.
అదే విధంగా ఎస్సీల ఓట్లు కూడా తమ ఖాతాలోనే పడ్డాయని ధీమాతో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు లేకపోవడం, అక్కడే ఈసారి ఓటింగ్ పెరగడం తమకు లాభమని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు .అదే విధంగా రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ వైపునకే మళ్లిందని చెబుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రచారంలో ముందుండి నడిపించడం వంటి అంశాల కారణంగా పోలింగ్ శాతం పెరిగిందని అంటున్నారు. పైగా చివరి రెండ్రోజుల్లో 60 శాతానికి మించి ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించడం తమ అభ్యర్థి గెలుపునకు సహకరిస్తాయని కాంగ్రెస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు మాకే అంటున్న బీఆర్ఎస్..
తెలంగాణ ఉద్యమ సమయంలో అండగా నిలిచిన భువనగిరి స్థానం ఈ ఎన్నికల్లోనూ తమకు అండగా నిలిచిందని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 80 శాతానికిపైగా పోలింగ్ నమోదు కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం పెరగడం తమకే అనుకూలమని అంటున్నారు.
వృద్దులు, మహిళలు, రైతులు బీఆర్ఎస్కు ఓట్లేసి అండగా నిలబడ్డారని చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో రైతుల అసంతృప్తి తమకు ఓట్ల రూపంలో కలిసి వస్తుందని అంటున్నారు. వీటన్నిటితో పాటు కురుమ, గొల్ల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తమకే పడ్డాయని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి, రాష్ట్ర సర్కారు హామీలు అమలు చేయకపోవడం వంటి అంశాలు కలిసి వస్తాయని అంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర ప్రభావం కూడా పోలింగ్‌పై ఉందని, తామే గెలుస్తామని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. ఎవరి అంచనాలు నిజమవుతాయో జూన్ 4 ఫలితాల్లో వెల్లడికానుంది.
యూత్, అర్బన్ ఓట్లపైనే బీజేపీ ఆశలు
ప్రధాని మోదీ ప్రభావం తమ అభ్యర్థి గెలుపునకు పూర్తిగా సహకరిస్తుందని బీజేపీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలోని ఓటర్లలో సగానికంటే ఎక్కువగా ఉన్న యూత్ ఓటర్లపై ప్రధాని మోదీ ప్రభావం ఉందని చెబుతున్నారు. వారిలో ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేశారని అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఈ నియోజకవర్గంలో 16 మున్సిపాలిటీలు ఉండగా, ఇక్కడి మెజార్టీ ఓటర్లు బీజేపీకి మద్దతుగా నిలిచారని చెబుతున్నారు.
మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన హామీ కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి అనూహ్యంగా మద్దతు లభించిందని అంటున్నారు. అలాగే నియోజకవర్గంలోని గౌడ సామాజికవర్గం ఓట్లలో ఎక్కువగా బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల కారణంగా ఎక్కువ మంది ఓట్లేయడం వల్ల పోలింగ్ పెరిగి తమకే లాభం కలిగిస్తుందని బీజేపీ లీడర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.