రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో వున్న సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారనే కథనాలు వినవస్తున్నాయి. తాజాగా భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఇంకా మిస్టరీ వీడకపోవడం అనుమానాలకు తావు ఇస్తుంది. వారిది హత్యా? ఆత్మహత్యా? అనేది కొలిక్కి రాలేదు. హాస్టల్ నిర్వహణలో లోపాలు, ఆటో డ్రైవర్ జోక్యంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఎంతో భవిష్యత్తు వున్న ఇద్దరు అమ్మాయిలు భవ్య, వైష్ణవిలు హాస్టల్ గదిలోనే మరణించడం రాష్ట్ర వ్యాప్తంగావున్న వివిధ ప్రభుత్వ హాస్టళ్ల స్థితిగతులను బట్ట బయలు చేస్తోంది. గడిచిన యేడు కూడా జరిగిన మరణాల వల్ల విద్యార్థులు భయ కంపితులు అవుతున్నారు.
హాస్టళ్ల అధ్వాన్న స్థితి మారాలి
ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే వసతి గృహాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా గిరిజన ఆశ్రమ, కస్తూర్భా పాఠశాలల వసతి గృహాల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఈ యేడు కూడా కలుషిత ఆహారం తినడంతో ఎంతోమంది కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం విషమించడంతో మరణించారు. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. వసతి గృహాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలను వసతిగృహాలకు పంపేందుకు వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మౌలిక సదుపాయాలు కరువు
అన్ని జిల్లాలలో వందలాది ఆశ్రమ పాఠశాలలు ఉండగా.. ఇందులో లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు స్థానికంగా ఉండకపోవడంతో కొన్నిచోట్ల విద్యార్థులే హాస్టల్‌లను నిర్వహించుకుంటూ చదువులు కొనసాగిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లోనే వసతిగృహాలు కొనసాగుతున్నాయి. అలాగే సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు వసతి గృహాలకు ప్రహరీలు, కంచెలు లేవు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల వసతిగృహాల్లో నిండు నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఏ ఒక్క వసతి గృహంలోనూ అర్హులైన వైద్య సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు.
హాస్టళ్లపై నిఘా పెంచాలి
ఈ రెండు ఏండ్లలో పదుల సంఖ్యలో విద్యార్థులు మృతి చెందడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నది. వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యంపై నిరంతరంగా నిఘా లేకపోవడంతోనే విద్యార్థులకు సరైన వసతులు, భద్రత లేదని తెలుస్తున్నది. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తేనే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వసతులు, భద్రత ఉండే అవకాశం ఉంటుంది. గత ఏడాది వరంగల్ జిల్లా వర్ధన్న పేట గిరిజన వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిని 36 మంది విద్యార్థులు ఆనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ హాస్టల్లో అయిదవ తరగతి విద్యార్థి సాయిరాజ్ పాము కాటుతో మరణించడం అందరినీ కలచి వేసింది.
బాలికలకు భద్రత కల్పించాలి
బాలికల వసతి గృహాలలో చెప్పుకోలేని ఇబ్బందులతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఏదైనా ఆపదొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సంక్షేమ హాస్టళ్లలో ఉన్న సమస్యలను ఆయా జిల్లాల పాలనాధికారులు తనిఖీలు చేసి సమస్యలు పరిష్కరించాలి. ఇకనైనా కొత్త ప్రభుత్వం తక్షణమే స్పందించి వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. బాలికలకు భద్రత కల్పించాలి. భువనగిరిలో విద్యార్థినుల ఆత్మహత్య మిస్టరీనీ ఛేదించాలి. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోమారు ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.
కామిడి సతీష్ రెడ్డి,జయశంకర్ భూపాల్పల్లి