ఒడిశాలో Fani తుఫాను ఇటీవల బీభత్సమే సృష్టించింది. భువనేశ్వర్, పూరీ నగరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో భువనేశ్వర్ క్యాపిటల్ హాస్పిటల్ లోని సిక్ అండ్ న్యూ బార్న్ కేర్ యూనిట్ లో నర్సులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి… 22 మంది పసిపిల్లల ప్రాణాలను కాపాడారు. ఈ విషయాన్ని ఒడిశా ఆరోగ్య శాఖ స్వయంగా ప్రకటించింది.
మే 3.
మధ్యాహ్నం 12.30 గంటల సమయం.
సైక్లోన్ Fani తీరం దాటిన తర్వాత బలమైన ఈదురుగాలులు, భారీ వర్షంతో భువనేశ్వర్ లో తుఫాను భయానక వాతావరణం ఉన్న సందర్భం.
ఆ టైమ్ లో SNCUలో నాలుగో అంతస్తులో 22 మంది అప్పుడే పుట్టిన శిశువులున్నారు. ఏడుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు అటెండెంట్స్, ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్నారు. వర్షం, తుఫాను బీభత్సానికి హాస్పిటల్ పై అంతస్తు పైకప్పు కూలిపోయింది. నర్సులు, స్టాఫ్ అంతా.. తమ ప్రాణాలను లెక్కచేయలేదు. శరీరాలను అడ్డుపెట్టి పిల్లలను కాపాడారు. శిథిలాలు చిన్నారులపై పడకుండా చూశారు. పైకప్పు కూలిపోవడంతో.. తాము కూడా బతుకుతామో లేదో అనుకున్నారు. కానీ.. షాక్ నుంచి తేరుకుని.. వెంటనే అక్కడినుంచి ఒక్కొక్కరు.. ఇద్దరు, ముగ్గురు పిల్లలను ఎత్తుకుని.. గ్రౌండ్ ఫ్లోర్ లోని NICUకి తీసుకెళ్లారు.
ప్రాణాలకు తెగించి.. క్యాపిటల్ హాస్పిటల్ స్టాఫ్ చూపించిన ధైర్యం వల్లే 22 మంది చిన్నారుల ప్రాణాలు దక్కాయని ఒడిశా వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వారికి తగిన విధంగా గౌరవిస్తామని ప్రకటించింది.