భువనగిరి నుంచి కోమటిరెడ్డి..? నల్లగొండ టికెట్​ బీసీలకు ఇస్తామని ప్రకటన

  • ఆలేరునూ బీసీలకే వదిలే చాన్స్​
  • ఇక భువనగిరి నుంచే అవకాశం​

యాదాద్రి, వెలుగు:  భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఈ సారి అసెంబ్లీ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే టికెట్​కోసం అప్లై చేసుకున్న ఆయన, నల్గొండ సీటును బీసీల కోసం వదులుకుంటానని ఇటీవల ప్రకటించారు. ఒకవేళ నల్గొండ సీటును వదులుకుంటే కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పోటీచేయబోయే స్థానం ఏమిటి? అనే చర్చ కాంగ్రెస్​ వర్గాల్లో మొదలైంది.  కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగరి పార్లమెంట్​ పరిధిలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలు ఆయన పోటీకి అనుకూలంగా ఉన్నాయి.  ఆలేరులో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  అక్కడ వెంకట్​రెడ్డి పోటీ చేసే చాన్స్​ లేదని, ఇక మిగిలిన భువనగిరి నుంచే పోటీ చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

 నల్గొండ నియోజకవర్గం పరిధిలో చాన్స్​ లేనట్లే 

గత ఎన్నికల్లో కాంగ్రెస్​తరపున భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీచేసిన కుంభం అనిల్​కుమార్​తాజాగా బీఆర్ఎస్​లో చేరారు. దీంతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిపై కాంగ్రెస్​ నుంచి ఎవరు పోటీలో ఉంటారనే ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో పార్టీలన్నీ బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వాలనే డిమాండ్​ తెరపైకి వచ్చింది. దీంతో ఒక్కో పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్​ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా భువనగిరి పార్లమెంట్​ పరిధిలోని భువనగిరి, ఆలేరు జనరల్​ స్థానాల నుంచి బీసీలు ఆశలు పెట్టుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి కూడా  బీసీలకు అనుకూలంగా ప్రకటన చేశారు. ఇటీవల పీసీసీ అప్లికేషన్లు ఆహ్వానించడంతో భువనగిరి సీటు కోసం 11 మంది అప్లై చేసుకోగా ముగ్గురు మినహా అందరూ బీసీలే ఉన్నారు. ఆలేరుకు 17 మంది అప్లై చేసుకోగా వారిలో ఇద్దరు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ కాగా, మిగిలిన 11 మంది ఓసీలే.  అప్లై చేసుకున్న వారిలో కొందరికి ఎంపీ కోమటిరెడ్డి ఆశీస్సులు ఉన్నాయని, మరికొందరికి మాజీ మంత్రి జానారెడ్డి ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఎవరికి వారే తమకే టికెట్​ వస్తుందని చెప్పుకుంటున్నారు. తాను బీసీలకు అనుకూలంగా ఉంటానని గతంలో ప్రకటించిన కోమటిరెడ్డి అవసరమైతే.. నల్గొండ సీటును బీసీలకు ఇవ్వడానికి సిద్ధమని ఇటీవల ప్రకటించడం చర్చకు దారితీసింది. 

భువనగిరి నుంచే పోటీకి చాన్స్​

భువనగిరి ఎంపీగా ఉన్న వెంకట్​రెడ్డి నల్గొండ అసెంబ్లీకి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ మారిన పరిస్థితుల్లో నల్గొండ సీటును  బీసీకి కేటాయిస్తామని చెప్తున్నారు. నల్గొండ పార్లమెంట్​పరిధిలోని దేవరకొండ ఎస్టీ రిజర్వ్ డ్​స్థానం​ కాగా మిగిలిన ఆరింటిలో కాంగ్రెస్​ పెద్ద తలకాయలతో పాటు వారసులు అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో ఆ సెగ్మెంట్లలో కోమటిరెడ్డి వేలుపెట్టే పరిస్థితి లేదు. ఇక భువనగిరి పార్లమెంట్​ పరిధిలోని  తుంగతుర్తి, నకిరేకల్​ ఎస్సీ రిజర్వ్​ స్థానాలు కాగా మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగామ, భువనగిరి, ఆలేరు జనరల్ ​స్థానాలు.  వీటిలో భువనగిరి, ఆలేరు మాత్రమే  కోమటిరెడ్డికి అనుకూలమైన సెగ్మెంట్లు. ఆయా చోట్ల బలమైన క్యాడర్​ ఉంది. అయితే ఆలేరు సెగ్మెంట్ జనరల్​ అయ్యాక ఇప్పటికి మూడుసార్లు బీసీ వర్గానికి చెందిన భిక్షమయ్య గౌడ్​ పోటీ చేస్తూ వస్తున్నారు.  దీంతో ఈసారి అక్కడి నుంచి బీసీ లీడర్లు ఆశపెట్టుకున్నారు.  దీంతో కోమటిరెడ్డి  ఈసారి భువనగిరి నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలియడంతో క్యాడర్​లో ఉత్సాహం నెలకొన్నది.