హైదరాబాద్, వెలుగు:మొహర్రం పండుగను బుధవారం హైదరాబాద్‌లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా నిర్వహించే వేడుకల్లో షియా తెగకు చెందిన ముస్లింలు మాతమ్ నిర్వహించారు. పాతబస్తీలోని డబీర్‌పురా బీబీ కా అలావా నుంచి బీబీ కా ఆలమ్ ఊరేగింపు మొదలై గుల్జార్‌హౌస్, చార్మినార్, మదీనా, సాలార్ జంగ్ మ్యూజియం మీదుగా చాదర్ఘాట్కర్బాలా మైదానం వరకు కొనసాగింది.
రూపవతి(ఏనుగు)పై బీబీ ఫాతిమా, ఇమామ్ హుస్సేన్ ఆలమ్ లను ఊరేగించారు. అంతకు ముందు పాతబస్తీలో అన్ని అలావాల నుంచి షియాలు బీబీ కా అలావాకు వచ్చారు. డబీర్‌పురాలో మంత్రి పొన్నం ప్రభాకర్పాల్గొని అలావాకు దట్టీ సమర్పించారు. చార్మినార్ వద్ద మాతమ్ ఊరేగింపులో సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.
చిన్నాపెద్ద తేడా లేకుండా షియాలు నల్ల దుస్తులు ధరించి, విషాద గీతాలు ఆలపిస్తూ, రక్తాన్ని చిందిస్తూ తమను తాము శిక్షించుకున్నారు. డబీర్‌పురా, మదీనాలోని ఇమామ్ హుస్సేన్ ఆలమ్ ముందు రక్తం చిందించారు. సికింద్రాబాద్‌లోని అలావాల వద్ద నిర్వహించిన ఊరేగింపులో భారీ సంఖ్యలో షియాలు పాల్గొన్నారు.
మాతమ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా1000 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ శ్రీనివాస్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.