యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో మినీ ఎయిమ్స్ నిర్మించాలని బీబీనగర్ ఎయిమ్స్ ప్లాన్ చేస్తోంది. దాదాపు 6 ఎకరాల్లో 10 కోట్ల రూపాయలతో మినీ ఎయిమ్స్‌ను నిర్మించబోతోంది. ఈ నిర్మాణం పూర్తైతే బొమ్మలరామారం, తుర్కపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర, శామీర్‌పేట్ మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే బొమ్మలరామారం పీహెచ్‌సీలో ‘గ్రామీణ ఆరోగ్య కేంద్రం’ ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్పెషాలిటీ వైద్య నిపుణులతో సేవలు అందిస్తోంది ఎయిమ్స్.
బొమ్మలరామారం మండలంలో మినీ ఎయిమ్స్ ఏర్పాటుకు 10 ఎకరాలు కేటాయించాలని 2021లో బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ భాటియా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం గతేడాది డిసెంబరులో మండలంలోని మల్యాల గ్రామపంచాయతీ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పక్కన సర్వే నంబర్ 199లో 6 ఎకరాలు కేటాయించింది. ఇందులో మినీ ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో అనుమతి ఇచ్చింది. ఎయిమ్స్ బడ్జెట్ నుంచి రూ.10 కోట్లు కేటాయించి.. రెండేళ్లలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.