న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెల 30లోగా కనీసం ఆరు గనులను వేలం వేయాలని రాష్ట్ర సర్కార్కు కేంద్రం సూచించింది. గడిచిన తొమ్మిదేండ్లలో కనీసం ఒక్క మినరల్ బ్లాక్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుదీర్ఘకాలంగా తెలంగాణలోని మైనింగ్ బ్లాక్ లు వేలానికి నోచుకోకపోవడం, అందుకు గల అడ్డంకులు, ఇతర అంశాలపై చర్చించారు.
ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రిమాండర్లు పంపినా స్పందిచకపోవడంతో తాజాగా లేఖ రాసినట్లు సమాచారం. వేలం వేయడం కోసం మొత్తం11 బ్లాక్ ల జియాలజికల్ రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ బ్లాక్ లలో 5 ఐరన్ ఓర్ మైన్స్, 5 లైమ్ స్టోన్ (సున్నపు రాయి), ఒక మాంగనీస్ బ్లాక్ ఉన్నాయి. ఈ 11 బ్లాక్ లలో కనీసం 6 బ్లాక్ లను ఈ నెల చివరి నాటికి వేలం వేయాలని లేఖలో కేంద్రం పేర్కొన్నట్లు తెలిసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే వేలం ప్రక్రియను తామే చేపట్టాల్సి వస్తుందని స్పష్టం చేసినట్టు సమాచారం.
సవరించిన మైనింగ్ రూల్స్–2021 ప్రకారం.. గనులను ఇన్ టైంలో వేలం వేయడంలో విఫలమైతే, ఆ బ్లాకులను విక్రయించే అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పింది. మైనింగ్ యాక్ట్ (వేలం విధానం) అమలులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 354 ప్రధానమైన బ్లాక్ లను వేలం వేశారు. ఇందులో 48 మినరల్ బ్లాక్ లలో ఉత్పత్తి ప్రారంభమైందని, ఈ వేలం ప్రక్రియతో రాష్ట్రాల ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.