- ధాన్యం టెండర్లకు బిడ్డింగ్ పూర్తి
- అత్యధికంగా ఒక సంస్థ నుంచి 14 బిడ్లు
- మొత్తం 25 లాట్‌లకు 54 బిడ్లు
- 10 లాట్‌లకు సింగిల్ టెండర్లు
హైదరాబాద్, వెలుగు : ధాన్యం టెండర్లకు బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయింది. యాసంగి ధాన్యానికి గ్లోబల్ టెండర్లు పిలవగా 54 టెక్నికల్ బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 66.85 లక్షల టన్నుల ధాన్యంలో తొలి విడతలో 25 లక్షల టన్నుల విక్రయానికి టెండర్లు పిలిచారు. ఈ 25 లక్షల టన్నులను 25 లాట్లుగా విభజించారు. ఒక్కో లాటు విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం 54 టెండర్ బిడ్లు దాఖలయ్యాయి.
ఇందులో 10 లాట్లకు సింగిల్ టెండర్లు దాఖలు కాగా, 10 లాట్లకు పోటీ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన 5 లాట్లకు ఒకటి కంటే ఎక్కువ బిడ్డింగులు దాఖలయ్యాయి. 1వ, 2వ లాట్‌లలో ఐదు చొప్పున బిడ్లు రాగా, 11వ లాట్‌కు 4 బిడ్లు వచ్చాయి. లాట్ నంబర్లు 4, 5, 6, 9, 10, 12కు మూడు చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. మిగతా 6 లాట్‌లకు రెండు చొప్పున బిడ్లు వచ్చాయి. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటెయిలింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా నుంచి అత్యధికంగా14 బిడ్లు దాఖలయ్యాయి.
ALSO READ: గ్లోబల్ లీడర్ల జాబితాలో టాప్.. ప్రపంచంలో నంబర్ వన్ మోదీ
కేంద్రీయ బండార్ అనే సంస్థ 13 బిడ్లు దాఖలు చేసింది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోమ్ అండ్ కంపెనీ 11 బిడ్లు దాఖలు చేయడం గమనార్హం. అయితే వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లుగా నిర్ధారించడంతో అది ఎక్కువేనని, అందుకే ఎక్కువ మంది పోటీకి రాలేదని సమాచారం. వంద కోట్ల టర్నోవర్ నిబంధన పెడితే మరింత మంది టెండర్లకు పోటీ పడే వారని తెలుస్తోంది. కాగా, శనివారం అధికారులు ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నారు.