బైడెన్ రాక.. భారత్‌కు ఫాయిదా!

‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నువ్వు పోటీ చేయొద్దు. కాదని పోటీ చేసినా ఓటమి తప్పదు’.. గతంలో ఒబామా అనేక సార్లు జో బైడెన్ కు చేసిన సూచన ఇది. 2020 ఎన్నికలు మొదలైన సమయంలో బైడెన్ పోటీకి దిగుతున్నట్లు ప్రకటించాక కూడా ఆయన అదే సలహా ఇచ్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా భారీ మెజారిటీతో గెలిచారు. వాస్తవానికి ఇండియన్స్ లో కూడా మెజారిటీ పబ్లిక్ బైడెన్ ఓడిపోతాడనే భావించారు. భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, పాక్ – చైనాల విషయంలోనూ ఆయన మనకే మద్దతుగా నిలుస్తుండడంతో ఇండియన్స్ అంతా ఆయనే మళ్లీ గెలవాలని కోరుకున్నారు. కానీ అంతా రివర్స్ కావడంతో ఇప్పుడు మనోళ్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. బైడెన్ వల్ల భారత్ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయం చాలా మందిలో ఉంది. అగ్రరాజ్యం అధిపతిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మన దేశంతో ఎలాంటి బంధాన్ని కొనసాగిస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

అమెరికా అధ్యక్ష పీఠం సొంతం చేసుకున్న డెమొక్రాట్ పార్టీ గడిచిన కొన్నేళ్లుగా తరచూ భారత్ పై విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ పార్టీలో పాకిస్థానీ–అమెరికన్స్ లాబీ ఎక్కువగా ఉండడం వల్లే యాంటీ ఇండియా కామెంట్స్ వస్తుంటాయన్న భావన ఉంది. ముఖ్యంగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ కాశ్మీర్ అంశంలో ఇండియాను తప్పుబట్టారు. ఆర్టికల్ 370 రద్దుపై మన విధానం సరైనది కాదన్నారు. అంతేకాదు వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన కమలా హ్యారిస్ భారత మూలాలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ ఆమె కూడా ఇదే తరహాలో స్పందించారు. ఈ పరిస్థితుల్లో భారత్ కు వ్యతిరేకంగా డెమొక్రాట్ పార్టీలో ఉన్న పాకిస్థానీ–అమెరికన్ లాబీ విషయం ఇప్పుడు మనోళ్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇటు పాకిస్థాన్, అటు చైనా సరిహద్దుల్లో ఉద్రికత్తలు, లఢఖ్ వద్ద చైనా అత్యుత్సాహం, భారీగా బలగాల మోహరింపు వంటి వరుస ఘటనలు జరుగుతున్న సమయంలో ట్రంప్ భారత్ కు అండగా నిలిచారు. చైనా దురాక్రమణ కుట్రలను ఖండించారు. కానీ ఇప్పుడు బైడెన్ మన దేశానికి అండగా నిలుస్తారా? లేదా? అన్నదానిపై సందేహాలు నెలకొన్నాయి.

మొదటి నుంచీ జీహాదీ టెర్రరిజంపై ట్రంప్ ఫైట్

రిపబ్లికన్ పార్టీ లీడర్ డొనాల్డ్ ట్రంప్ 2017 జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత్ కు మేలు చేశాయి. పదవిలోకి వస్తూనే ఇస్లామిక్ జీహాదీ టెర్రరిజానికి వ్యతిరేకంగా చర్యలు మొదలుపెట్టారాయన.  పాక్ ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారిందని, టెర్రర్ గ్రూప్స్ పై కఠినంగా వ్యవహరించాలని అనేక సార్లు హెచ్చరించారు. అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చిన లాడెన్ కు పాక్ ఆశ్రయం కల్పించడంపైనా గుస్సాగా ఉన్నారు. ఆ దేశాన్ని ఎప్పుడూ ఫ్రెండ్లీ నేషన్ గా ట్రంప్ గుర్తించలేదు. చైనా విషయంలోనూ కఠినంగానే ఉన్నారు. చైనాపై వాణిజ్య పరంగా అప్రకటిత యుద్ధాన్నే చేశారు. చైనా వస్తువులపై భారీగా ఇంపోర్ట్ ట్యాక్సులు పెంచారు. ఆ దేశంలో ఉన్న అమెరికన్ కంపెనీలు వాటి ఫ్యాక్టరీలను అక్కడి నుంచి తరలించాలని వాటి మేనేజ్ మెంట్ కు సూచించారు. యాపిల్ లాంటి కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ ను ఇండియాలో పెట్టాయి కూడా. ఇలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చైనా ఎకానమీపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అమెరికా ఎకానమీపై చైనా గూడ్స్ ప్రభావాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకున్నా అవి భారత్ కు మేలు చేశాయి. చైనా మిలటరీ చర్యల విషయంలోనూ ట్రంప్ వ్యవహరించిన తీరు మనకు మేలు చేసింది. చైనాకు వ్యతిరేకంగా ఆసియా–పసిఫిక్ దేశాలను ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. దక్షిణ చైనా సముద్రంలో భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి యుద్ధసన్నాహాలు లాంటివి చేస్తూ చైనాను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

బైడెన్ రాకతో మార్పులు!

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ రాకతో ట్రంప్ వల్ల జరిగిన కొన్ని ఇబ్బందులు క్లియర్ అవుతాయి. మొదట లాభపడేది హెచ్1బీ వీసాలపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నవాళ్లే అని చెప్పొచ్చు. అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలో ట్రంప్ చేసిన మార్పుల వల్ల ఇండియా స్టూడెంట్స్, ఐటీ సెక్టార్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ కు వెళ్లాలనుకునే భారత విద్యార్థులు, ఐటీ ఉద్యోగులకు బైడెన్ మంచి రిలీఫ్ ఇచ్చే చాన్స్ ఉంది. ఇమిగ్రేషన్ పాలసీలో ఆ దిశగా మార్పులు చేస్తానని ఆయన ప్రకటించారు. చైనా, పాక్ విషయంలో బైడెన్ నిర్ణయాలు ఎలా ఉంటాయన్నదే అందరిలో ఆందోళన నెలకొంది. అయితే పాకిస్థాన్ టెర్రరిజం ఇష్యూలో బైడెన్ కూడా కఠినంగానే వ్యవహరిస్తారు. ఈ విషయంలో భారత్ ప్రయోజనాలకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వెనక్కి వచ్చేసేలా తాలిబన్ తో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసుకున్న ఒప్పందాలను కూడా బైడెన్ రద్దు చేస్తారు. ఇది కూడా భారత్ కు మేలు చేస్తుంది.  పొరుగు దేశాలపై దురాక్రమణ చైనా ప్రయత్నిస్తే తాను వ్యతిరేకిస్తానని బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రంలో చైనా దూకుడును కట్టడి చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను బందిపోటు అంటూ బైడెన్ చేసిన కామెంట్స్ ను మర్చిపోకూడదు. భారత్ – చైనా సరిహద్దు అంశంలోనూ బైడెన్ మనకే సపోర్ట్ గా నిలుస్తారని చెప్పొచ్చు. రక్షణ రంగంలో ఇండియా అమెరికా చేసుకున్న ఒప్పందాల్లో రెండు కీలక ఒప్పందాలు ఒబామా పీరియడ్ లో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉండగానే జరిగాయన్న విషయాన్ని గుర్తించాలి.

1959 నుంచి భారత్ కు చైనా శత్రుదేశంగానే వ్యవహరించింది. 1962 యుద్ధం తర్వాతి నుంచైతే పాకిస్థాన్ కు నేరుగా ఫండింగ్ చేస్తూ ఇండియాపైకి ఎగదోస్తూ వచ్చింది. ఈ ఏడాది మే నెల నుంచి చైనా బలగాలు పరిధులు దాటి లఢఖ్ వద్ద మన భూభాగంలోకి వచ్చేందుకు కుట్రలు చేశాయి. ఈ సమయంలో చైనా తీరును తప్పుబడుతూ ట్రంప్ సీరియస్ గా స్పందించారు. గతంలో ఎన్నడూ ఒక అమెరికా అధ్యక్షుడు భారత్ కు మద్దతు పలుకుతూ చైనాకు వ్యతిరేకంగా ఈ తరహాలో రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. అమెరికా డిఫెన్స్, విదేశాంగ మంత్రులు అక్టోబర్ 27న చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మకం. చైనాపై నిఘా పెట్టేందుకు అవసరమైతే అమెరికా శాటిలైట్స్ సహా అన్ని ఇతర ఇంటెలిజెన్స్ మార్గాలను భారత్ వాడుకునేందుకు అంగీకారం తెలుపుతూ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. ట్రంప్ తన స్వలాభం కోసం కావచ్చు, భారత్ ను మిత్రదేశంలా భావించి కావచ్చు ఏ కారణంతో చేసినా ఆయన నిర్ణయాలు మనకు మేలు చేశాయి. ఇప్పుడు వీటన్నింటినీ బైడెన్ పూర్తిగా పక్కన పెట్టేస్తారా అన్నదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

స్వశక్తిపై నమ్మకంతో..

ఏది ఏమైనా భారత్ కు ఇతర దేశాలతో ఆర్థిక, దౌత్య పరంగా మంచి సంబంధాలు కొనసాగించే గుణం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. చైనా విషయంలో భారత్ తన స్వశక్తితో ఎదుర్కొని నిలబడగలమన్న నమ్మకంతో ముందుకు సాగాలి.  ట్రంప్, బైడెన్ అన్న తేడా లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా సరే కలిసి ముందుకు సాగాలి. ‘దేశాలకు శాశ్వత మిత్రులు అంటూ ఉండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి’ అని 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ లార్డ్ పల్మేర్ స్టోన్ చెప్పారు. ఇది అక్షరాలా సత్యం. ట్రంప్ తో ఎలా మంచి సంబంధాలు ఉన్నాయో అలానే బైడెన్ తోనూ ఏర్పరుచుకోవాలి. గతంలో డెమొక్రాట్ ప్రెసిడెంట్ అయిన ఒబామా మనకు మంచి ఫ్రెండ్ గా ఉన్నారు. ఆ తర్వాత ట్రంప్ వచ్చాక ఆయనతో దోస్తీ నడిచింది. ఇప్పుడు బైడెన్ విషయంలో కూడా అంతే.

– పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ అనలిస్ట్

For More News..

మొదలైన దుబ్బాక కౌంటింగ్..

సీఎం మాటిచ్చి ఆరేళ్లాయే.. రాచకొండ ఫిల్మ్​సిటీ ముచ్చటేదీ!

జడ్పీటీసీ వేధిస్తున్నడని సూసైడ్ అటెంప్ట్