యూట్యూబర్​: మన వీడియోలకు.. ఫారిన్​ ఫ్యామిలీ రియాక్షన్స్​​​

యూట్యూబర్​: మన వీడియోలకు.. ఫారిన్​ ఫ్యామిలీ రియాక్షన్స్​​​

కుటుంబమంతా కలిసి సినిమా చూస్తున్నప్పుడు..ఏదైనా హైలెట్​ సీన్​ రాగానేఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్షన్స్​ ఇస్తుంటారు. కొందరు అలాంటి మూమెంట్స్‌‌ని సరదాగా వీడియో తీసుకుంటుంటారు. కానీ.. ఓ ఫారిన్​ ఫ్యామిలీ అలాంటివీడియోలను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేస్తూ.. లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇండియన్​ సినిమా ట్రైలర్లు, సీన్లకే రియాక్షన్​ వీడియోలు చేస్తూ.. మనవాళ్లని ఆకట్టుకుంటున్నారు.  

ఇండియన్​ కల్చర్​, సినిమా, సంగీతం, ఫుడ్​.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాయి. మన సినిమాలకు చాలా దేశాల్లో ఫ్యాన్స్​ ఉన్నారు. భారతీయ సినిమాలను బాగా ఇష్టపడే డెన్మార్క్‌‌కు చెందిన ఒక కుటుంబం.. ఆ ఇష్టాన్ని రియాక్షన్​ వీడియోల రూపంలో చూపిస్తోంది. అందుకోసం ‘బిగ్‌‌ ఏ రియాక్ట్’ పేరుతో ఒక చానెల్​ని నడుపుతున్నారు. చానెల్​లో హార్ట్‌‌ఫుల్​ రియాక్షన్స్​ని పంచుకుని మిలియన్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు.

కంటెంట్ స్టైల్​

బిగ్​ ఏ రియాక్ట్‌‌లో ఇండియన్​ సినిమా ట్రైలర్లు, మ్యూజిక్, కామెడీ వీడియోల మీద ఎక్కువగా కంటెంట్​ చేస్తుంటారు. కొన్ని కుకింగ్​ వీడియోల మీద కూడా రియాక్షన్స్​ ఇచ్చారు. ఉదాహరణకు.. విలేజ్ కుకింగ్ చానెల్‌‌లో ఆక్టోపస్ వంటపై చేసిన రియాక్షన్​ వీడియోకు చాలా రెస్పాన్స్​ వచ్చింది. అయితే.. ప్రతి వీడియోలో భారతీయ సంస్కృతి పట్ల వాళ్లకు ఉన్న గౌరవం, ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి. 

మనవాళ్లే ఎక్కువ

బిక్​ ఏ రియాక్ట్‌‌ చానెల్‌‌ని ఇప్పటివరకు 1.41 మిలియన్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు. వాళ్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. వ్యూస్​ కూడా మనదేశం నుంచే ఎక్కువగా వస్తుంటాయి. చానెల్​ని 2014లోనే పెట్టినప్పటికీ ఐదేండ్ల క్రితం మొదటి వీడియో అప్​లోడ్​ చేశారు. చానెల్​లో ప్రస్తుతం 668 వీడియోలు ఉన్నాయి. వాటిలో విక్రమ్​ సినిమాలో హీరో సూర్య (రోలెక్స్ క్యారెక్టర్)​​ ఎంట్రీ సీన్​పై చేసిన రియాక్షన్​ వీడియోకి 5.5 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. 

ఇక హీరో విజయ్​ మాస్టర్​ సినిమా క్లైమాక్స్​ మీద చేసిన రియాక్షన్​ షార్ట్ వీడియోకైతే 51 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి.  పది మిలియన్ల వ్యూస్​ దాటిన షార్ట్‌‌ వీడియోలు చానెల్‌‌లో చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు బాలీవుడ్(హిందీ), టాలీవుడ్ (తెలుగు), కోలీవుడ్ (తమిళం), మాలీవుడ్ (మలయాళం), శాండల్‌‌వుడ్ (కన్నడ) వీడియోల మీదే ఎక్కువగా వీడియోలు చేశారు. అయితే.. కొన్నాళ్ల నుంచి కాపీరైట్​ సమస్యలు, మరికొన్ని కారణాల వల్ల చానెల్‌‌లో వీడియోలు అప్​లోడ్​ చేయడం లేదు. ట్రావెల్ వ్లాగ్స్​, లైఫ్​స్టైల్​ కంటెంట్ లాంటివి కూడా చేస్తామని గతంలోనే ప్రకటించారు.

ఇండియాకు రావాలని..

బిగ్‌‌ఏరియాక్ట్ కుటుంబానికి ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్లు మన దేశానికి వచ్చి స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను నేరుగా చూడాలి అనుకుంటున్నట్టు చాలాసార్లు చెప్పారు. కానీ.. కుదరలేదు. భవిష్యత్తులో కచ్చితంగా ఇండియాకు వస్తామంటున్నారు. ప్రస్తుతం ఆండ్రియాస్ కొన్ని భారతీయ భాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

కొన్నాళ్ల క్రితం బిగ్​ఏ ఫ్యామిలీ మాల్దీవులకు వెళ్లింది. అక్కడి అందమైన ప్రదేశాలను వీడియో తీసి చానెల్​లో పోస్ట్‌‌ చేశారు. ఆ తర్వాత సొంత పాప్ అండ్​ పియానో ​​మ్యూజిక్​ వీడియోని కూడా రూపొందించారు. ఆ ఒరిజినల్ ట్రాక్‌‌లను చానెల్​లో అప్​లోడ్​ చేసినా పెద్దగా వ్యూస్​​ రాలేదు.  

బాహుబలితో ఐడియా

కొన్నేళ్ల క్రితం ఆండ్రియాస్ (బిగ్ ఏ)కి తన ఫ్రెండ్​ బాహుబలి సినిమా ట్రైలర్ చూపించాడు. అది చూసి ఆండ్రియాస్​ చాలా ఇంప్రెస్‌‌ అయ్యాడు. భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరిగింది. అప్పటినుంచి ఇండియన్​ సినిమాల ట్రైలర్లు, మ్యూజిక్​ వీడియోలు చూసేవాడు. అయితే.. అప్పుడే యూట్యూబ్​లో రియాక్షన్​ వీడియోల ట్రెండ్​ మొదలైంది. దాంతో తను కూడా ఇండియన్​ సినిమాల మీద రియాక్షన్​ వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే అతను పెట్టిన ‘బిగ్‌‌ ఏ రియాక్ట్’​లో బాహుబలి ట్రైలర్​ మీద వీడియో చేసి అప్​లోడ్​ చేశాడు. కానీ.. అది చానెల్​లో మొదటి వీడియో కావడం, అప్పటికి సబ్​స్క్రయిబర్లు లేకపోవడంతో పెద్దగా రెస్పాన్స్​ రాలేదు.

 తర్వాత కొత్త... పాత అనే తేడా లేకుండా ఎన్నో సినిమాల్లోని హైలెట్ ​సీన్లకు రియాక్షన్​ వీడియోలు చేశాడు. కొన్నాళ్లకు అతని భార్య కామిల్లాతోపాటు పిల్లలు నదియా, ఆల్మా కూడా తోడయ్యారు. వాళ్లు వీడియోల్లో కనిపించడం మొదలయ్యాక చానెల్​కు విపరీతంగా క్రేజ్​ పెరిగింది. వాళ్లకు భారతీయ భాషలు తెలియకపోయినా, ఇంగ్లీష్ సబ్‌‌టైటిల్స్ సాయంతో కంటెంట్​ని అర్థం చేసుకుని, తమ అభిప్రాయాలను పంచుకుంటుంటారు.