ఒకరికి జ్వరం.. మరొకరి గాయం.. ఆసియా కప్ నుండి మరో ఇద్దరు ఔట్

ఆసియా కప్‌ 2023 ప్రారంభానికి ముందు అన్ని జట్లను గాయాలు, రోగాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆతిథ్య శ్రీలంక జట్టులో ఇద్దరు కరోనా బారిన పడగా, మరో ముగ్గురు గాయాల కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆపై భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాయి. తాజాగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు చెందిన మరో ఇద్దరు ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. 

బంగ్లాదేశ్‌ స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. దీంతో అతని స్థానంలో బంగ్లా క్రికెట్‌ బోర్డు.. అన్‌మోల్‌ హక్‌ను ఎంపిక చేసింది. తాజాగా ఆ జట్టు పేసర్ ఎబాదత్ హొస్సేన్ ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచ కప్‌కు దూరమయ్యారు. ఇటీవల అఫ్ఘానిస్థాన్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో గాయపడ్డ ఎబాదత్.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అయినప్పటికీ ఆ గాయం తగ్గకపోగా..ఆపరేషన్ తప్పనిసరి అవుతోంది. దీంతో అతను మూడు నుండి నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారు. త్వరలోనే అతను చికిత్స కోసం యూకే బయలుదేరి వెళ్లనున్నారు. ఈ మేరకు బంగ్లా క్రికెట్‌ బోర్డు ప్రకటన చేసింది.

ALSO READ :నరాలి పూర్ణిమ.. ఈ పండుగను రాఖీ రోజునే ఎందుకు జరుపుకుంటారంటే..

కాగా, బంగ్లా టైగర్స్ తమ ఆసియా కప్ తొలి పోరులో శ్రీలంకతో తలపడునున్నారు. ఈ మ్యాచ్ గురువారం(ఆగస్టు 31) క్యాండీలోని పల్లెకెలె వేదికగా జరగనుంది.