తెలుగు బిగ్ బాస్: ఒకరిపైనొకరు అరుచుకున్న కంటెస్టెంట్లు

తెలుగు బిగ్ బాస్: ఒకరిపైనొకరు అరుచుకున్న కంటెస్టెంట్లు

ఎవరిలోనూ ఫైర్ లేదని, సరిగ్గా ఆడటం లేదని వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కోప్పడ్డారు. అది బాగా పని చేసిందో ఏమో.. ఇవాళ్టి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ అందరూ అయామ్ ఫైర్, అయామ్ ద ఫైర్ అన్నట్టు ఒకరిపై ఒకరు నిప్పులు కుమ్మరించారు. మాటల తూటాలు పేల్చుకున్నారు. మొత్తంగా ఇంటిని రణరంగంగా మార్చేశారు.

గుసగుసలూ.. లుకలుకలూ..

ఇవాళ్టి ఎపిసోడ్‌ గుసగుసలు, లుకలుకలుతో మొదలైంది. గుంపులు గుంపులుగా మీటింగులు పెట్టుకుని మరీ ఇతరులకి వంకలు పెట్టే కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇలాంటి వాటిలో ఆరోహి పార్టిసిపేషన్ బాగుంటుంది. ఓసారి రేవంత్‌ని, మరోసారి బాలాదిత్యని.. ఇలా ఎవరో ఒకరి గురించి గుసగుసలాడటం ఆమె చాలాసార్లు చేసింది. ఇవాళ ఏకంగా అందరినీ టార్గెట్ చేసింది. ఇంట్లోవాళ్ల పర్‌‌ఫార్మెన్సులు తట్టుకోలేకపోతున్నానని, అందరూ ఓ రేంజ్‌లో నటిస్తున్నారని అంటోంది. ఎవ్వరిలోనూ ఆడాలనే కసి లేదట. రేవంత్ ఒక్కడే అదరగొడుతున్నాడు అంటూ మిగతావాళ్లందరినీ తీసి పారేసింది. ఆమె మాత్రం కసితో ఎక్కడ ఆడుతోందని! పొరపాటున నువ్వు వెళ్లకు అంటే నేనేమైనా తక్కువా, ఎందుకు ఎంకరేజ్ చేయరు అని దెబ్బలాడుతుంది. వెళ్లి గెలుస్తుందా అంటే ఏదో ఒక కారణంతో వెనకబడిపోతుంది. ఆ తర్వాత ఎమోషనల్ అయిపోయి తాను వీక్‌ అని తనే ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. దానికి తోడు సూర్య ఆటని కూడా చెడగొడుతుంది. స్ట్రాంగ్ కంటెండర్ అయిన సూర్యని ఆరోహియే పక్కదారి పట్టిస్తోందనే కామెంట్లు ఆల్రెడీ వస్తున్నాయి. అది తెలియక ఆమె అందరి ఆటకీ వంకలు పెట్టడం విశేషం. 

సత్యకి జైలు.. కీర్తికి కన్నీళ్లు

వరస్ట్ పర్‌‌ఫార్మర్ ఆఫ్ ద వీక్‌గా ఎంపికైన శ్రీసత్యకి జైలు కూడు తప్పలేదు. బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఆమెని ఇవాళ కాసేపు జైలుకు పంపారు. ప్రతిదానికీ ఎమోషనల్ అయ్యే కీర్తి ఈ విషయానికి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అయితే సత్య జైల్లో ఉన్నప్పుడు ఓ తమాషా జరిగింది. తన దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్న గీతూని.. నాలో మైనస్‌లు ఏంటో చెప్పమని సత్య అడిగింది. దానికి గీతూ.. నువ్వు కోపంగా ఉంటున్నావు, ఏం చెప్పినా అగ్రెసివ్‌గా చెప్తున్నావు, అలా ఉండకు, కూల్‌గా ఉండు అంటూ సలహాలిచ్చింది. అసలు తన మాటతీరుతో అందరినీ హర్ట్ చేసే గీతూయే ఒకరికి ఇలాంటి సలహాలు ఇవ్వడాన్ని మించిన కామెడీ ఇంకేముంటుంది! అయినా సత్య కూడా తగ్గలేదు. నేను డబ్బుల కోసమే ఇక్కడికి వచ్చా, అందుకని నన్ను నేను మార్చుకోలేను అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత అర్జున్ జైలు దగ్గరకు వెళ్లి మరీ సత్యతో తన స్టైల్లో మీటింగ్ పెట్టాడు. ఇక పట్టపగలే నిద్రపోయే విషయంలో కొత్త కెప్టెన్‌ రాజ్‌కి, ఆరోహికి మధ్య చిచ్చు రగిలింది. ఇద్దరూ నిద్రపోయారు. కుక్కలు మొరిగాయి. నువ్వూ నిద్రపోయావు కదా నన్నెలా అంటావని ఆరోహి గొడవ. నేను నిద్రపోయినప్పుడు మొరగలేదు, నువ్వు నిద్రపోయినప్పుడే కుక్కలు మొరిగాయి అని రాజ్‌ గొడవ. మధ్యలో బాలాదిత్య దూరి ఏదో సర్ది చెప్పబోయాడు కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆరోహి కదా.. వింటుందా? తగ్గేదే లే అంటుంది. 

మనసు తెరవమంటే..

ఇంతవరకు ఇంట్లో చాలామంది ఓపెనప్ అవ్వలేదనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి, తోటి హౌస్‌మేట్స్ వస్తున్నాయి. మొన్న నాగ్ కూడా అదే అన్నారు. దాంతో అందరి మనసు తలుపులూ తెరిచే చాన్స్ మరొకటి ఇచ్చాడు బిగ్‌బాస్. మనసులో ఉన్నదాన్ని బయటకు చెప్పి నామినేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాడు. దాంతో ఎక్కడెక్కడి కారణాలనో పట్టుకొచ్చారంతా. లోపల దాచుకున్న కోపాల్ని, ద్వేషాల్ని ఒక్కసారిగా కుమ్మరించేశారు. సత్యేమో ఆరోహి, ఇనయాల్ని.. గీతూ చంటి, సుదీపల్ని.. చంటి రేవంత్,గీతూల్ని.. ఇనయా గీతూ, రేవంత్‌లని.. ఆదిరెడ్డి ఇనయా, వాసంతిలని.. బాలాదిత్య ఆరోహి, రేవంత్‌లని.. వాసంతి ఆదిరెడ్డి, నేహాల్ని.. మెరీనా – రోహిత్  రేవంత్, ఫైమాల్ని, సూర్య రేవంత్, బాలాదిత్యల్ని.. కీర్తి ఆరోహిని, చంటిని.. నేహా వాసంతిని, గీతూని.. ఇలా ప్రతి ఒక్కరూ ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసుకుంటూ వెళ్లారు. అయితే నామినేట్ చేసేటప్పుడు ఒకరి గురించి మరొకరు చెప్పిన రీజన్స్ కారణంగా రచ్చ మొదలైంది. కీర్తి, శ్రీహాన్ తప్ప దాదాపు అందరూ కంట్రోల్ తప్పారు. ఆవేశపడ్డారు. తమ పాయింట్‌ని బలంగా చెప్పే క్రమంలో అరుచుకున్నారు కూడా. గీతూ, ఇనయా ఎప్పటిలానే విరుచుకుపడ్డారు. అవతలి వారిని ఈజీగా పాయింటవుట్ చేసేసి, ఇది మార్చుకో అంటూ సలహాలిచ్చేసే గీతూ.. తన గురించి ఎవరైనా ఏదైనా చెబితే మాత్రం కరెక్ట్ చేసుకోడానికి సిద్ధంగా ఉండదు. నేనింతే, అది నా స్టైల్, నేనిలాగే ఆడతా అంటూ ఇవాళ కూడా తన యాటిట్యూడ్‌ని బయట పెట్టింది. ఇనయా కూడా ఎవరినీ సరిగ్గా మాట్లాడనివ్వకుండా మధ్యలో దూరిపోయి కేకలు పెట్టింది. ఈ ఇద్దరికీ గొడవ రావడంతో లిమిట్స్ దాటి మరీ తిట్టుకున్నారు. ఇక తన మిస్ క్యారేజ్ గురించి అందరితో షేర్ చేసుకున్నరోజు ఎమోషనల్ అయ్యి చాలా టిష్యూలు వాడిన సుదీప.. వాటిని డస్ట్బిన్‌లో వేయకుండా అక్కడే వదిలేసిందనే అర్థం పర్థం లేని కారణంతో ఆమెని నామినేట్ చేసింది గీతూ. దానికి సుదీప చాలా బాధపడింది. ఆ సిట్యుయేషన్‌ని కూడా తప్పుబట్టడం అన్యాయమంటూ కాస్త ఎమోషనల్ అయ్యింది. నేహ, వాసంతి కూడా తమ తమ కారణాలతో కాస్త గట్టిగానే వాదులాడుకున్నారు. ఫైమా చెప్పిన సిల్లీ రీజన్‌కి మెరీనా, రోహిత్‌లు నవ్వుకున్నారు. రాజ్‌ని అడ్డుపెట్టుకుని కీర్తి వేసిన నామినేషన్‌ని చంటి తప్పుబట్టాడు. గీతూని నామినేట్ చేసేటప్పుడు మాత్రం చంటి తన పాయింట్‌ని మరోసారి గట్టిగా వినిపించాడు. తన నేచర్‌‌ని అర్థం చేసుకోలేక ఫేక్‌గా ఉంటున్నానని, సేఫ్‌ గేమ్ ఆడుతున్నానంటూ కామెంట్ చేస్తున్నారని బాలాదిత్య ఫీలయ్యాడు. మొత్తానికి కొన్ని బలమైన కారణాలు.. కొన్ని అత్యంత సిల్లీ కారణాలతో పెద్ద రభసే జరిగింది. 


    
ఏదేమైతేనేం.. ఈవారం పదిమంది నామినేట్ అయ్యారు. రేవంత్, బాలాదిత్య, శ్రీహాన్, గీతూ, చంటి, సుదీప, ఆరోహి, నేహ, ఇనయా, వాసంతి డేంజర్‌‌ జోన్‌లో పడ్డారు. మరి వీరిలో ఎవరు సేఫ్ అవుతారో! ఎవరు ఎలిమినేట్ అవుతారో!