- గత రెండు ఎన్నికల్లో గెలిచింది ఒక్కొక్క సీటే
- ఈసారి ఎన్నికల ముందే ఇద్దరు కీలక నేతలు గుడ్ బై
- బలహీన పడిన బీఆర్ఎస్, జోష్‌లో కాంగ్రెస్
- మంత్రి కేటీఆర్‌కు టాస్క్.. 30న జిల్లా పర్యటన
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అగ్నిపరీక్షలా మారాయి. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో సీటుతోనే సరిపెట్టుకోగా.. ఈసారి ఆ ఆనవాయితీని మార్చాలని సీఎం భావిస్తున్నారు. కానీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇద్దరు కీలక నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో ఈసారి ఫలితాలపై వాళ్లిద్దరి ప్రభావం ఉంటుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో పార్టీలో ముఖ్య నాయకుల మధ్య అనైక్యత, ఆధిపత్య పోరుతో ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. దీన్ని సరిదిద్ది, లీడర్లను ఏకతాటిపై నిలిపేందుకు పార్టీ అధినేత చేసిన ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వడం లేదు. ఎన్నికల ఇన్చార్జిల నియామకంలో లుకలుకలు, ఒకరిపై మరొకరు ఫిర్యాదుల కారణంగా ఎమ్మెల్యేలే పార్టీ ముఖ్య నేతలపై బహిరంగ కామెంట్లు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో కీలకమైన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 30నఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. భద్రాచలం, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేయనున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు నేతలతో భేటీ కానున్నారు.
వలసవచ్చిన ఎమ్మెల్యేలే దిక్కు..
2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీటీసీ మాత్రమే కారు గుర్తుపై గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఒక్క ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ నుంచి గెలిచారు. 2018 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల్లో గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ బలం పెరిగినట్లయింది. ఇద్దరు టీడీపీ, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత స్థానిక సంస్థలు, మున్సిపల్, సొసైటీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఆ పార్టీ స్వింగ్ లోకి వచ్చింది. అప్పటి నుంచి ఫుల్ జోష్ లో ఉన్న అధికార పార్టీకి ఇటీవల ఇద్దరు కీలక నేతలు గుడ్ బై చెప్పారు. ఎలాంటి పదవి దక్కకపోవడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోరుకున్న పాలేరు టికెట్ రాకపోవడంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు ప్రతి నియోజకవర్గంలో లీడర్లు కనిపిస్తున్నా ఎన్నికల టైంలో క్యాడర్ ఎటువైపు నిలుస్తుందో అంతుచిక్కక హైకమాండ్‌లో టెన్షన్ కనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పటికీ సంస్థాగత ఓటు బ్యాంక్ తో బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్ కు, కొత్త నేతల మరింత ఉత్సాహం వచ్చింది. కానీ ఆ పార్టీలో కొత్త, పాత లీడర్ల మధ్య సీట్ల కేటాయింపులో కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకునే స్థాయిలో బీఆర్ఎస్ నేతల మధ్య ఐక్యత లేకపోవడం మైనస్‌గా మారింది.
కేటీఆర్ ముందు పెద్ద టాస్క్
ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఇద్దరు లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక జడ్పీ చైర్మన్, వందల సంఖ్యలో ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులున్నారు. కానీ సెకండ్ క్యాడర్ ను ముందుంచి నడిపించాల్సిన ముఖ్య నేతల మధ్య సఖ్యత లేదన్నది బీఆర్ఎస్ లో బహిరంగ రహస్యమే. మంత్రిపై ఎమ్మెల్యే బహిరంగ కామెంట్లు, ఒక ఎంపీపై జడ్పీ చైర్మన్ కంప్లైంట్లు, ఒక ఎమ్మెల్సీపై మరో ఎమ్మెల్యే ఫిర్యాదులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్మన్ కార్యక్రమాలు, ఇన్చార్జిగా తప్పించడంపై మరికొందరి అలకలు, ఎన్నికల ఇన్చార్జిలపై ఇంకొందరి అభ్యంతరాలు.. ఇలా లీడర్ల మధ్య అనేక సమస్యలున్నాయి. కీలకమైన ఎన్నికలకు ముందు వారి మధ్య ఐక్యత సాధించి పార్టీని ఏకతాటిపై నడిపించే బాధ్యతలో కేటీఆర్ఎంతవరకు సక్సెస్అవుతారనే చర్చ పార్టీలో జరుగుతోంది.