సోనియా గాంధీ.. కాంగ్రెస్​ను నిలబెడ్తరా?

సుదీర్ఘ కాలం కాంగ్రెస్​ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ ఇప్పుడు అతి పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ అని బీజేపీ అంటుంటే.. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష హోదాకు కాంగ్రెస్​ను దూరం చేసేందుకు మమత పావులు కదుపుతున్నారు. ఇక సొంత పార్టీ నేతల నుంచి కూడా సోనియాకు తిరుగుబాటు ఎదురవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మళ్లీ పార్టీ పగ్గాలు అందుకున్న సోనియా.. 75 ఏండ్ల వయసులో కాంగ్రెస్​ను ఎలా గట్టెక్కిస్తారని దేశమంతా ఎదురుచూస్తోంది. 

కాంగ్రెస్​ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అన్ని వైపుల నుంచి ఆ పార్టీపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఒకవైపు వరుస ఓటములు మరోవైపు కార్యకర్తలు, నాయకుల్లో పెరిగిన నిస్తేజం పార్టీని మరింతగా దిగజారుస్తోంది. సరైన నాయకత్వం లేదని సొంత పార్టీ నేతలే మీడియాకెక్కి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు తీసుకున్న సోనియా.. వయసు భారాన్ని ఎదుర్కొంటూనే పార్టీకి కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.

మూడుసార్లు ప్రధాని అవకాశం వచ్చినా..
అధికార పీఠాన్ని సోనియాగాంధీ మూడుసార్లు తిరస్కరించారు. 1991లో రాజీవ్‌‌ హత్య తర్వాత తొలిసారి ఆమెకు అవకాశం వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్‌‌ నడుమ హడావుడిగా జరిగిన కాంగ్రెస్‌‌ వర్కింగ్‌‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం సోనియాను పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంటే ఎన్నికల తర్వాత ఆటోమాటిక్‌‌గా ఆమె ప్రధాని కావొచ్చు. అయినా ఆమె దానిని తిరస్కరించి పీవీ నరసింహారావును కాంగ్రెస్‌‌ అధ్యక్షుడిగా ఎన్నికోవాలని కోరారు. ఆ తర్వాత ఆయనను ప్రధానిని చేశారు. 1994లో పీవీపై అర్జున్‌‌ సింగ్‌‌ తిరుగుబాటు చేసినప్పుడు సోనియాకు రెండోసారి అవకాశం వచ్చింది. అప్పుడు పీవీని తొలగించి సోనియా కోసం అర్జున్‌‌ సింగ్‌‌ సర్వం సిద్ధం చేశారు. అప్పుడు కూడా ఆమె తిరస్కరించారు. మూడోసారి ఆమె ప్రధాని అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులూ లేకపోయినా స్వచ్ఛందంగా పదవిని వదులుకుని ఒక గాంధేయవాద సందేశం ఇచ్చారు. దానికి ఆమె మాటలే నిదర్శనం. 2004 మే 18న పార్లమెంట్‌‌ సెంట్రల్‌‌ హాల్‌‌లో సోనియా ప్రసంగిస్తూ ‘‘ఒక విషయంలో నేను స్పష్టంగా ఉన్నాను. ప్రధాని పదవి నా లక్ష్యం కానే కాదు. ఈ పదవిని గౌరవంగా తిరస్కరించు అని నా మనసు చెబుతోంది. ఇన్ని రోజులు మార్గనిర్దేశం చేస్తూ వచ్చిన సూత్రాలకు నేను కట్టుబడి ఉన్నా. అధికారం నన్ను ఎప్పుడూ ఆకర్షించలేదు” అని ప్రకటించారు.

పదవీ త్యాగం చేసి..
తన విదేశీయతపై ప్రత్యర్థుల విమర్శలకు సోనియాగాంధీ ఎలాంటి ఎదురుదాడి చేయకుండా ప్రధాని పదవిని త్యాగం చేసి వాళ్ల నోళ్లు మూయించారు. 2004లో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అనాలోచితంగా తీసుకున్నదైతే కాదు. ముళ్ల కిరీటం లాంటి అధికారానికి దూరంగా ఉండాలని అన్నీ ఆలోచించి తీసుకున్న గాంధేయవాద నిర్ణయం. నిశ్శబ్దంగా, ఎటువంటి కోలాహలం లేకుండా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్‌‌కు చెందిన మేరీ ట్యూడర్‌‌‌‌ మాదిరిగా కావాలని సోనియా కోరుకోలేదు. సమాజంలో విభజనకు తాను కారణం కాకూడదని, సామాజిక సామరస్యం, జాతీయ సమైక్యతకు చిహ్నంగా ఉండాలని సోనియా కోరుకున్నారు. 

పంచమర్హి డిక్లరేషన్‌‌
1998లో సోనియా కాంగ్రెస్‌‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పంచమర్హిలో చింతన్‌‌ బైఠక్‌‌ను నిర్వహించారు. 1998 సెప్టెంబర్‌‌‌‌ 6న అది పంచమర్హి డిక్లరేషన్‌‌గా వచ్చింది. అన్ని పార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం ఆధారంగా పార్లమెంట్‌‌లో మహిళా రిజర్వేషన్‌‌ బిల్లును ఆమోదించాలనేది ఆ డిక్లరేషన్‌‌ ఉద్దేశం. కానీ అప్పటి ప్రభుత్వం ఆమె మాటను పట్టించుకోలేదు. ‘పార్టీకి సంబంధించిన అన్ని ఎన్నికల్లో, రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల కోసం టిక్కెట్ల కేటాయింపులో మహిళా ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడానికి కట్టుబడి ఉన్నాం’ అని పంచమర్హి డిక్లరేషన్‌‌లో సోనియా స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్‌‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే మహిళా బిల్లు లోక్‌‌సభలో వీగిపోకుండా ఉండేందుకు రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.

హక్కుల ఆధారిత దేశ నిర్మాణం
అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్‌‌‌‌ పర్సన్‌‌గా, నేషనల్‌‌ అడ్వైజరీ కౌన్సిల్‌‌ (ఎన్‌‌ఏసీ) చైర్‌‌‌‌ పర్సన్‌‌గా హక్కుల ఆధారిత చర్యలను సోనియా ప్రవేశ పెట్టారు. పార్లమెంట్‌‌లో చట్టం చేయడం ద్వారా వీటికి హామీ కల్పించారు. అడవుల్లో నివసించే షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల భూమి కౌలు, జీవనం, ఆహార భద్రతకు హామీ ఇచ్చే అటవీ హక్కుల చట్టం ఇందులో ఉంది. ఉపాధి హామీ చట్టం పనిచేసే హక్కే లక్ష్యంగా తీసుకున్న భారీ సామాజిక భద్రతా చర్య. దేశంలోని 130 కోట్ల మంది ప్రజల్లో మూడింట రెండొంతుల మందికి రాయితీతో కూడిన ఆహార ధాన్యాలను అందించాలని జాతీయ ఆహార భద్రత చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా హక్కు చట్టం ప్రజల్లో విద్య ప్రోత్సాహానికి, విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది. భూ సేకరణ చట్టం భూసేకరణను రెగ్యులేట్‌‌ చేయడానికి కృషి చేసి, బాధిత వ్యక్తులకు పరిహారం, పునరావాసం, రీసెటిల్‌‌మెంట్‌‌ను మంజూరు చేసేందుకు విధానాలను, నియమాలను నిర్దేశిస్తుంది. ఆజీవిక మిషన్‌‌ గ్రామీణ పేద మహిళలు స్వయం సహాయక బృందాలు చేసుకునేందుకు కృషి చేస్తుంది.

అవినీతిపై పోరాటానికి..
అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని కాంగ్రెస్​ పార్టీ ఎలా ఉధృతం చేయగలదని విశ్వసిస్తుందో సోనియా వివరించారు. యూపీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపై పోరాడేందుకు సామాన్యుని ఆయుధమైన సమాచార హక్కు(ఆర్‌‌‌‌టీఐ) చట్టం తీసుకువచ్చారు. ఆర్‌‌‌‌టీఐతో పాటు ఆధార్‌‌‌‌ను కూడా ప్రవేశపెట్టి అవినీతిపై పోరాడేందుకు విశ్వసనీయమైన పునాదిని వేశారు. ప్రతిపక్షాల నినాదాల కంటే మిన్నగా ఆమె ఈ గొప్ప పని చేశారు. 2010లో బురారీలో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో అవినీతిని ఎదుర్కొని పోరాడేందుకు, దానిని రూపుమాపేందుకు సోనియా ఒక యాక్షన్‌‌ ప్లాన్‌‌ ఆవిష్కరించారు. నాలుగంచెల బ్లూ ప్రింట్‌‌తో ముందుకు వచ్చారు. ఒకటి, ప్రభుత్వోద్యుగుల అవినీతి కేసులను త్వరితగతిన విచారించడం, రెండు ప్రొక్యూర్‌‌‌‌మెంట్లు, కాంట్రాక్ట్‌‌ల్లో పారదర్శకత, మూడు మంత్రుల విచక్షణాధికారాలు వదులుకోవడం, నాలుగు సహజ వనరులను వెలికి తీసేందుకు బహిరంగ వేలం విధానాలు తీసుకొచ్చారు.

అన్నివైపుల నుంచీ సవాళ్లే..
పదేండ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటంతో కీలక నాయకులంతా పార్టీకి దూరమయ్యారు. కొందరు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. సొంత పార్టీకి సరైన 
నాయకత్వం ఇవ్వలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు వరుస ఓటములు పార్టీకి కుంగదీస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో పార్టీ బలం నామమాత్రంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీని మళ్లీ నిలబెట్టాల్సిన బాధ్యత సోనియాపైనే పడింది. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. 
కానీ ఒకవైపు కాంగ్రెస్​ ముక్త్​ భారత్​ అంటూ బీజేపీ, మరోవైపు కాంగ్రెస్​ను ఒంటరి చేసేలా బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ వేగంగా అడుగులు వేస్తున్నారు. వీటన్నింటినీ తట్టుకుంటూ పార్టీని పునర్​వైభవం దిశగా నడిపించడానికి సోనియా ప్రయత్నాలు చేస్తున్నారు. తన వ్యూహ రచనలతో వచ్చే ఎలక్షన్లలో పార్టీని సోనియా ఎలా నిలబెట్టుకుంటారో చూడాలి.