- రాంనగర్, గాంధీ చౌక్ లో భారీ మట్టి గణపతులు
- జనాల్లో పెరుగుతున్న పర్యావరణ స్పృహ
కరీంనగర్, వెలుగు: ఏటా ఎకో గణపతులపై జనాలకు ఆసక్తి పెరుగుతోంది. కొన్నేండ్లుగా స్వచ్ఛంద సంస్థలు, అధికారులు మట్టి గణపతులను పూజించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటంతో జనాల్లో పర్యావరణంపై స్పృహ పెరుగుతోంది. కరీంనగర్ సిటీలోని రాంనగర్, గాంధీ చౌక్‌లో భారీ మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏటా మట్టి గణపతుల వినియోగం పెరుగుతుండటంతో ఆ వృత్తిపై ఆధారపడినవారికి జీవనోపాధి
దొరుకుతోంది.
మట్టి గణపతులకు డిమాండ్
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ కేంద్రంగా భారీ మట్టి గణపతులు తయారుచేస్తూ ఏటా వినాయక చవితికి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ మట్టి గణపతుల తయారీ వెనుక గ్రామస్థుల పర్యావరణ స్పృహ దాగి ఉంది. తమ ఊరి శివారులో ఉండే మానేరు కలుషితానికి పీవోపీ వ్యర్థాలే కారణమని గ్రహించి, మట్టి విగ్రహాలు వాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో కొన్నేండ్లుగా విగ్రహాల తయారీ చేపట్టారు. బొమ్మకల్ గ్రామంలో బెంగాల్ కు చెందిన కళాకారులు మట్టి గణపయ్యలను కళాత్మకంగా తయారు చేస్తుండటంతో డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి గణపతులు కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వస్తున్నారు. కరీంనగర్ సిటీలోనూ మట్టి గణపతుల వినియోగం పెరుగుతోంది. ఇండ్లలో పూజించుకునే చిన్న గణపతుల నుంచి కూడళ్లలో పెట్టే భారీ గణపతులు సైతం మట్టివే ఉంటున్నాయి.
ఫీట్నుంచి 20 ఫీట్ల దాక..
మట్టి గణపతుల తయారీలో చెరువుల నుంచి తెచ్చిన బంకమట్టి, ఎండిన వరిగడ్డి, తవుడు, ఊక, వెదురు బొంగులు ఉపయోగిస్తారు. ఇవన్నీ పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు. భారీసైజ్ విగ్రహాల తయారీకి కొంత బంకమట్టిని ప్రత్యేకంగా బెంగాల్ నుంచి లారీల్లో తెప్పిస్తున్నారు. చెరువులు, వాగుల్లో ఈ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసిన ప్పుడు తేలిగ్గా నీటిలో కరుగుతాయి. దీంతో నీటి కాలుష్యం జరగదు. ముఖ్యంగా తవుడు, ఊక చెరువులోని చేపలకు ఆహారంగా పనిచేస్తాయి. విగ్రహాల డిజైన్, సైజ్ ల ఆధారంగా రేట్లు ఉంటాయి. ఒక్కో విగ్రహాన్ని కనిష్ఠంగా రూ.3 వేల నుంచి గరిష్ఠంగా రూ. 70 వేల దాకా అమ్ముతున్నారు. బొమ్మకల్తయారీ కేంద్రంలో ఫీట్సైజ్నుంచి దాదాపు 20 అడుగుల దాకా తయారు చేస్తున్నారు.
సిటీలో భారీ మట్టి గణపతులు
సిటీలోని రాంనగర్ ఏరియాలో మిత్ర యూత్ ఆధ్వర్యంలో 24 ఫీట్ల భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటు స్థలంలోనే రెండు నెలల పాటు శ్రమించి బొమ్మకల్ కళాకారులు గణేశుడి విగ్రహాన్ని తయారుచేశారు. గాంధీ రోడ్ జంక్షన్ లోనూ 20 ఫీట్లు, నాఖా చౌరస్తాలోనూ 13 ఫీట్ల మట్టి గణపతులను ఏర్పాటు చేస్తున్నారు. సిటీలో మరో పది చోట్ల కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. చాలా మందికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అవగాహన కల్పించడం, స్కూళ్లలో వీటి ప్రాముఖ్యాన్ని వివరించడంతో పిల్లలు కూడా మట్టి గణపతుల వైపే మొగ్గు చూపుతున్నారు.
పర్యావరణానికి హాని చేయొద్దనే..
మిత్ర యూత్ ఆధ్వర్యంలో 24 ఏండ్ల నుంచి గణపతిని ఏర్పాటు చేస్తున్నాం. గతంలో పీవోపీ విగ్రహాలే ఏర్పాటు చేసేవాళ్లం. రెండేండ్ల నుంచి మట్టి గణపతులే పెట్టాలని నిర్ణయించుకున్నం. కానీ కరోనా వల్ల చేయలేకపోయాం. ఈ ఏడాది మంటపం దగ్గరే 24 ఫీట్ల విగ్రహాన్ని తయారు చేయించాం. మమ్మల్ని చూసి మరో 10 కమిటీలవారు మట్టి గణపతులు పెడుతున్నారు. మార్పు ఒకేసారి రాకున్నా ఒక చోట మొదలైతే అందరూ ఎకో ఫ్రెండ్లీ గణపతులు పెడితే చాలా మంచిది కదా.
- బొంగోని శివ గౌడ్, రాంనగర్, కరీంనగర్