పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లి గ్రామంలో బుధవారం మొసలి కలకలం రేపింది. గ్రామానికి చెందిన బోయ బీచుపల్లినాయుడు అనే వ్యక్తి ఇంట్లోకి బుధవారం భారీ మొసలి వచ్చింది. చెట్ల పొదల్లో ఉన్న మొసలిని గమనించిన కవిత అనే మహిళ వెంటనే స్థానికులు, కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. వారు వనపర్తి జిల్లా కేంద్రంలోని సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్‌కు ఫోన్ చేశారు.
అతడు తన టీమ్‌తో గ్రామానికి చేరుకొని సుమారు మూడు గంటల పాటు శ్రమించి 11 ఫీట్ల పొడవు, 230 కేజీల బరువున్న మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం అయ్యవారిపల్లి గ్రామ సెక్రటరీ స్వాతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాణి సాయంతో మొసలిని కృష్ణానదిలో వదిలిపెట్టారు.