- భార్య లక్ష్మి కోసం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- అన్న కొడుకు సూర్యపవన్ రెడ్డి కోసం మంత్రి వెంకట్‌రెడ్డి,
- గుత్తా అమిత్ కోసం మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి
- చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోసం సీఎం రేవంత్
- డీకే ద్వారా ఫైళ్ల శేఖర్‌రెడ్డి ప్రయత్నాలు
నల్గొండ, వెలుగు: భువనగిరి పార్లమెంట్ సీటు కోసం నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో టఫ్ ఫైట్ నడుస్తోంది. తమవారికి టికెట్ ఇప్పించుకునేందుకు హేమాహేమీ లీడర్లంతా రంగంలోకి దిగడంతో పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. కుటుంబసభ్యుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీపడ్తుండగా, అనుచరుడి కోసం ఏకంగా సీఎం ప్రయత్నిస్తుండడం విశేషం. ఈ ముగ్గురి మధ్యలోకి ఇటీవల బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చిన గుత్తా అమిత్, పైళ్ల శేఖర్‌రెడ్డి ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేయిస్తుండడం ఆసక్తిరేపుతోంది.
బ్రదర్స్ మధ్యే మొదటి పోటీ..
భువనగిరి ఎంపీ సీటు కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు పోటీపడ్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన భార్య లక్ష్మికి ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇంకోవైపు తన అన్న కొడుకు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బ్రదర్స్ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒక మంత్రి ఇచ్చినందున మళ్లీ అదే ఫ్యామిలీకి ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తరని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎంపీ టికెట్ తనకే వస్తదన్న నమ్మకంతో కిరణ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి బద్రర్స్ సపోర్ట్‌తోనే భువనగిరి ఎంపీ సెగ్మెంట్లో పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కానీ, మంత్రి పదవి వస్తద ని ఆశించిన రాజగోపాల్ రెడ్డికి కేబినెట్లో చోటు దక్కకపోవడంతో భార్య లక్ష్మికి ఎంపీ టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం అనూహ్యంగా తన అన్న కొడుకు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు. సూర్య పవన్ రెడ్డిని వెంటబెట్టుకుని సీఎం రేవంత్‌ను కలవడంతో భువనగిరి సీటు వ్యవహారం రసకందాయంలో పడింది.
అమిత్, ఫైళ్ల ఎంట్రీతో మారిన సీన్..
కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ కోసం ఓవైపు హైడ్రామా నడు స్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో టికెట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తనకు టికెట్ ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని అమిత్ రెడ్డి ప్రకటించారు. జిల్లా మంత్రులతోపాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో చర్చలు జరపడం ద్వారా రేసులోకి వచ్చారు. ఇక భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కర్నాటక నుంచి చక్రం తిప్పుతున్నారు. అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. వీరిద్దరి ఎంట్రీతో భువనగిరి సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఐదుకు చేరింది. కోమటి రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో పార్టీ హైకమాండ్ ఏదైనా అభ్యంతరం చెప్తే మధ్యేమార్గంగా శేఖర్‌రెడ్డి, అమిత్‌లో ఎవరినో ఒకరిని ఫైనల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ, సీఎం అండదండలతో రేసులోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందేనని ఆయన వర్గీయులు పట్టబుడుతున్నారు.
తెరపైకి బీసీ క్యాండేట్..
బీజేపీ నుంచి బీసీ సామాజికవర్గం నుంచి బూర నర్సయ్య గౌడ్‌కు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సైతం బీసీ క్యాండేట్‌ను బరిలో నిలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులిద్దరూ బీసీలు అయితే కాంగ్రెస్ హైకమాండ్ సైతం బీసీకి చాన్స్ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల టైంలో నల్గొండ సీటును బీసీలకు ఇస్తానని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ కేడర్ ఒత్తిడి మేరకు ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు ఒక్క ఆలేరు సీటు మాత్రమే ఇచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ సైతం బీసీ అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తే అప్పుడు మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగ ర్ పేరును పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.