రోజుకో ట్విస్టుతో.. రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ గొడవ

హైదరాబాద్‌/బడంగ్​పేట, వెలుగు: సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి తనపై  దాడిచేశారని మంచు మనోజ్‌ సోమవారం పహాడీషరీఫ్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే తన చిన్నకొడుకు మనోజ్‌తో ప్రాణహాణి ఉందని మోహన్​బాబు పోలీసులను ఆశ్రయించారు. రాచకొండ సీపీ సుధీర్‌‌బాబుకు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా మనోజ్​ ఫిర్యాదుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

మనోజ్‌ నుంచి నన్ను కాపాడండి: మోహన్‌బాబు

‘‘జల్‌పల్లి మంచు టౌన్‌లో కుటుంబంతో కలిసి పదేండ్లుగా నివసిస్తున్నాను. నా చిన్న కొడుకు మనోజ్‌ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నాలుగు నెలల కింద తిరిగి వచ్చాడు. అతని వద్ద పనిచేస్తున్న కొంతమందితో కలిసి ఆదివారం ఉదయం ఇంట్లో అలజడి సృష్టించాడు. సోమవారం ఉదయం10.30 గంటల ప్రాంతంలో మాదాపూర్‌‌లోని నా ఆఫీసులోకి దాదాపు 30 మంది అక్రమంగా ప్రవేశించారని అక్కడి సిబ్బంది ద్వారా తెలిసింది. 

వాళ్లు అంతా నా కొడుకు మనోజ్‌ అనుచరులుగా గుర్తించాం. మనోజ్, మౌనిక ఆదేశాలతో నా ఇంటిని, ఆఫీసును ఆక్రమించుకునేందుకు యత్నించినట్లు తెలిసింది. అసాంఘిక శక్తులతో కలిసి నాపై దాడి చేయడంతోపాటు ఇంటిని శాశ్వతంగా సొంతం చేసుకోవాలని స్కెచ్​ వేస్తున్నారు. నాకు వయస్సు 78 ఏండ్లు. మనోజ్, మౌనిక నుంచి నాకు ప్రాణహాణి ఉంది. వారి నుంచి నా ప్రాణాలు, ఆస్తులను కాపాడండి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని మోహన్‌బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నన్ను చంపే కుట్ర జరుగుతోంది: మనోజ్‌

సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత మనోజ్ పహాడిషరీఫ్ పీఎస్‌కు వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌‌ గురువారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ‘‘ఆదివారం ఉదయం 9 గంటలకు 10 మంది గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు పట్టుకుని నా ఇంట్లోకి చొరబడ్డారు. నన్ను, నా భార్యను చంపేస్తామని బెదిరించారు. నన్ను చూసి పారిపోతున్న కొందరిని పట్టుకునేందుకు యత్నించాను. ఈ క్రమంలో నాకు గాయాలయ్యాయి. దుండగుల దాడి నుంచి భార్య, కూతురును కాపాడుకుని హాస్పిటల్‌కు వెళ్లాను. ఇంట్లో పనిచేసే విజయ్‌రెడ్డి, కిరణ్​రెడ్డి సీసీటీవీ ఫుటేజీలను మాయం చేశారు. వారిద్దరూ అసాంఘిక శక్తులతో కలిసి చంపాలని స్కెచ్​వేసినట్లు అనుమానంగా ఉంది. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తనతోపాటు భార్య, పిల్లలపై దాడి చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోండి. నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది.”అని మంచు మనోజ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అలాగే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తనకు న్యాయం చేయాలని మనోజ్​ఎక్స్(ట్విట్టర్)లో కోరారు. పారదర్శకమైన న్యాయ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ‘‘నాపై, నా భార్యపై నా తండ్రి మోహన్​బాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. నన్ను పక్కదారి పట్టించేందుకు మా నాన్న ప్రతి విషయంలో విష్ణుకు మద్దతు ఇస్తూనే వస్తున్నారు. నేను ఎన్నో త్యాగాలు చేశాను. మా అన్న విష్ణు కుటుంబ ఆస్తులను దుర్వినియోగం చేశాడు. వ్యక్తిగత లాభం కోసం మా ఇంటి పేరు మీద ఆధారపడ్డాడు. నేను ఇండిపెండెంట్​గా ఉంటున్నాడు. నేను ఎప్పుడూ ఆస్తులు అడగలేదు. వారసత్వం కోరుకోలేదు. మా నాన్న ఫిర్యాదులో నా 7 నెలల కూతురు గురించి ప్రస్తావించడం బాధాకరం’’ అని ఎక్స్​లో పేర్కొన్నాడు.