- బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా? నేనా?
- సై అంటున్న అర్వింద్.. పోటీకి దూరంగా కవిత
- కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి యాక్టివ్
- అభ్యర్థి వెతుకులాటలో బీఆర్ఎస్
నిజామాబాద్, వెలుగు: బీజేపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న నిజామాబాద్‌పై కాంగ్రెస్ కన్నేసింది. కాషాయం పార్టీ నుంచి టికెట్ఖాయం చేసుకొని ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న అర్వింద్ కొద్దిరోజులుగా తన హాట్‌హాట్ కామెంట్లతో ఇందూరు పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నారు. గత ప్రత్యర్థి, కవిత ఈ సారి పోటీకి దూరంగా ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ డీలాపడడం, ఆ పార్టీ నుంచి పోటీకి అభ్యర్థులే కరువైన పరిస్థితుల్లో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య బిగ్ఫైట్ఉండే చాన్స్ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే అర్వింద్‌కు దీటైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది.
గెలుపుపై బీజేపీ ధీమా..
తెలంగాణ ఏర్పడ్డాక జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారాయి. అంతకు ముందు కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉండగా ప్రజలు ఒక్కోసారి ఒక్కోరకమైన తీర్పు ఇచ్చేవారు. 2004 నుంచి 2014 దాకా రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా మధుయాష్కీ గెలిచారు. తెలంగాణ వచ్చాక జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పార్టీ చీఫ్ కేసీఆర్తనయ కవిత విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికల్లో ప్రజలు అనూహ్యంగా బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్‌ను గెలిపించారు.
ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీచేయగా, అందులో 178 మంది రైతులే ఉండడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రాంత రైతుల ప్రధాన డిమాండ్‌గా ఉన్న పసుపు బోర్డును సాధిస్తామని అర్వింద్ బాండ్‌పేపర్ రాసివ్వడం, ఎంపీ కవిత ఆధిపత్యం పట్ల సొంత పార్టీ బీఆర్ఎస్లోనే వ్యతిరేకత రావడం లాంటి అంశాలు బీజేపీ విజయానికి కలిసివచ్చాయి. పాలిటిక్స్‌లో ఎంటరై పోటీ చేసిన ఫస్ట్ ఎలక్షన్లో సీఎం కేసీఆర్ కూతురు కవితను ఓడించడం ద్వారా అర్వింద్ సత్తా చాటారు.
ఆ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా చేసిన కామెంట్లు ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చాయి. గడిచిన ఐదేళ్లలో జిల్లా పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన అర్వింద్ పేరును లోక్‌సభ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ మొదటి లిస్టులోనే ప్రకటించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్‌నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైనా, ఎంపీ టికెట్ పై ధీమాతో ఆయన నెల కిందే ఎన్నికల ప్రచారం షురూ చేశారు. పసుపు బోర్డు సాధన, ప్రధాని మోదీ క్రేజ్, రామాలయ నిర్మాణం లాంటి అంశాలు తనను మరోసారి గెలిపిస్తాయని అర్వింద్ ధీమాగా ఉన్నారు.
బీజేపీకి బ్రేక్ వేసేందుకు కాంగ్రెస్ ప్లాన్
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో బోధన్, రూరల్ నియోజవర్గాల్లో కాంగ్రెస్, అర్బన్, ఆర్మూర్‌లో బీజేపీ..బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్‌లోకి రావడంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుకూల వాతావరణం కనిస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికీ నాలుగు అమలు చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల స్కీం ఇంప్లిమెంటేషన్ ప్రయత్నాలు స్పీడప్అయ్యాయి. పార్టీలో జరుగుతున్న చేరికలు, ప్రజల్లో ఉన్న పాజిటివిటీ ఎంపీ ఎన్నికల్లో లాభిస్తుందనే నమక్మంతో ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా ఇందూరును తన ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
కీలకమైన మైనారిటీ ఓటర్లు, పాత టీడీపీ క్యాడర్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడం అదనపు బలం. సమర్థుడైన అభ్యర్థిని బరిలో నిలపడం ద్వారా విక్టరీ కొట్టాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. కాంగ్రెస్ నుంచి దాదాపు డజను మంది లీడర్లు అప్లై చేసుకున్నా జగిత్యాలకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బీసీ కోటా కింద బాల్కొండకు చెందిన మాజీ విప్ ఈరవత్రి అనిల్ పేర్లను హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. జీవన్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నిజామాబాద్‌లో జరిగిన రెండు పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారా పోటీకి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. తన సహజ తీరుకు భిన్నంగా ఎంపీ అర్వింద్‌ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్లు చేయడం విశేషం.
అభ్యర్థి కోసం వెతుకులాటలో బీఆర్ఎస్
పార్లమెంట్సెగ్మెంట్లో బీఆర్ఎస్కు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలున్నా లోక్‌సభ ఎన్నికల విషయం వచ్చేసరికి ఒక రకమైన సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన ఆ పార్టీ లీడర్లతో పాటు క్యాడర్లో నైరాశ్యం అలుముకుంది. ఎంపీగా కవిత పోటీ చేయరనే సంగతిపై క్లారిటీ వచ్చినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకరు బరిలోకి దిగితే గౌరవప్రదమైన ఓట్లు లభిస్తాయో? లేదో? అనే అనుమానం లీడర్లలో ఉంది. వనరులన్నీ సమకూర్చి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజారెడ్డి గోవర్ధన్‌ను పోటీ చేయించే ఆలోచనతో పార్టీ ఉండగా ఆయన ఇంట్రెస్ట్ చూపడంలేదు. బీసీ కార్డును ప్రయోగించాలనే ఆలోచనతో ఎమ్మెల్సీ రమణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.