డిఫెన్స్​కు పెద్దపద్దు.. రూ.6.21 లక్షల కోట్లు కేటాయింపు

డిఫెన్స్​కు పెద్దపద్దు.. రూ.6.21 లక్షల కోట్లు కేటాయింపు
  • మొత్తం బడ్జెట్​లో 12.9 శాతం రక్షణకే
  •  2023‌‌-24 బడ్జెట్​ కన్నా రూ.27,940 కోట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: యూనియన్  బడ్జెట్  2024–25లో రక్షణ రంగానికి పాతపద్దునే (మధ్యంతర బడ్జెట్) కొనసాగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఈసారి బడ్జెట్ లో ఎప్పట్లాగే డిఫెన్స్‌ కు ఫస్ట్  ప్రయారిటీ ఇచ్చారు. ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి నిర్మలమ్మ మొత్తం రూ.6,21,940 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్ లో ఇది 12.9 శాతం. నిరుటి కేటాయింపులు రూ.5.94 లక్షల కోట్ల కన్నా రూ.27,940 కోట్లు ఎక్కువగా కేటాయించారు.

అలాగే మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లుగా అంచనా వేశారు. డిఫెన్స్ పై కేటాయింపులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్  సింగ్  ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు. మొత్తం బడ్జెట్ లో రక్షణ రంగానికి అత్యధిక కేటాయింపులు చేసినందుకు నిర్మలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిఫెన్స్ లో స్వయంసమృద్ధి సాధించేందుకు ఆ కేటాయింపులు తోడ్పతాయని ఆయన అన్నారు.

‘‘మూలధన వ్యయం రూ.1.72 లక్షల కోట్లతో సాయుధ బలగాలకు మరింత ఊతం దొరుకుతుంది. అలాగే రూ.1.05 లక్షల కోట్లతో దేశీయంగా ఆయుధాలు కొనేందుకు వీలు కలగడంతో స్వయంసమృద్ధి సాధించేందుకు అవకాశం కలుగుతుంది. ఇక సరిహద్దు రోడ్లకు గత బడ్జెట్ లో ఈసారి రూ.6,500 కోట్లు కేటాయించారు. నిరుటి కేటాయింపులతో పోలిస్తే ఇది 30 శాతం ఎక్కువ. ఈసారి కేటాయింపులతో సరిహద్దు మౌలికసదుపాయాలు మరింత వృద్ధి చెందుతాయి” అని రాజ్ నాథ్  పేర్కొన్నారు. ఇక రక్షణ రంగాల్లో స్టార్టప్  పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.518 కోట్లు కేటాయించారు.

ఐడెక్స్  స్కీమ్  కింద ఈ కేటాయింపులు చేశారు. స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈలు, ఇన్నొవేటర్లు సూచించే సాంకేతిక పరిష్కారాలకు నిధులు సమకూర్చేందుకు ఐడెక్స్  స్కీమ్  కింద నిర్మల రూ.518 కోట్లు కేటాయించారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో డిఫెన్స్  రంగానికి రూ.6.21 లక్షల కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఎక్స్ సర్వీస్ మెన్ కు పెరిగిన కేటాయింపులు

ఎక్స్ సర్వీస్ మెన్  కాంట్రిబ్యూటరీ హెల్త్  స్కీమ్ కు తాజా బడ్జెట్ లో కేటాయింపులు పెంచారు. మొత్తం రూ.6,968 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 28% ఎక్కువ. 

రక్షణ రంగం మరింత పటిష్టం

దేశీయ రక్షణ తయారీ రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  అన్నారు. దేశీయ రక్షణ తయారీ రంగాన్ని ప్రోత్సహించి, విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడాన్ని తగ్గిస్తామని ఆమె తెలిపారు. వచ్చే ఐదు నుంచి ఆరేండ్లలో రక్షణ ఆయుధాల తయారీపై రూ.10 లక్షల కోట్లు ఖర్చుచేస్తామని వెల్లడించారు. వచ్చే ఐదేండ్లలో మ్యానుఫ్యాక్చరింగ్  టర్నోవర్ లో రూ.1.75 లక్షల కోట్లు ఖర్చుపెడ్తామన్నారు. ఇక 2023–24లో దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి రూ.1.27 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు.

దానికి ముందు ఏడాది 2022–23లో రక్షణ ఉత్పత్తి రూ.1.09 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఏటికేడాది దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకుంటున్నదని తెలిపారు. చివరి మూడేండ్లలో 12,300 పరికరాలను సొంతంగా తయారు చేశామని, రక్షణ తయారీ రంగంలో స్వయంసమృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని మంత్రి వెల్లడించారు.