హైదరాబాద్: నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం హాజరు కావాలన్న నిబంధన నుంచి అల్లు అర్జున్కు కోర్టు మినహాయింపునిచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని కోర్టు గతంలో షరతులు విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరాడు. మరోవైపు అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతినిచ్చింది. డిసెంబర్ 4, 2024న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప 2 బెనిఫిట్ షోకు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు.
ఎలాంటి అనుమతి లేకుండా ఓపెన్ టాప్ కారులో రావడం, ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇదే ఘటనలో గాయపడ్డ ఆమె కుమారుడు శ్రీతేజ్ ను కిమ్స్ కు తరలించగా మృత్యువుతో పోరాడుతున్నాడు. దీంతో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఓనర్లు, మేనేజర్, సిబ్బంది మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.
అల్లు అర్జున్ ను డిసెంబర్ 13, 2024న అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్పై మరుసటిరోజు (14న) చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ ప్రముఖులు క్యూ కట్టి సంఘీభావం ప్రకటించారు. కానీ, రేవతి కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకునేందుకు ఆవైపు పెద్దగా ఎవరూ వెళ్లకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అల్లు అర్జున్తో పాటూ సినీ ప్రముఖుల తీరును అసెంబ్లీ వేదికగా సీఎం తప్పుపట్టారు. ‘‘మీ సినిమా చూసేందుకు వచ్చి ఓ మహిళ చనిపోయి, ఆమె కుమారుడు చావుబతుకుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని పరామర్శించని మీకు మానవత్వం అనేది ఉందా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యల తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి.. తన తప్పు లేదని, పోలీసులదే తప్పన్నట్లు పరోక్షంగా మాట్లాడాడు. దీనికి పోలీసులు ఆధారాలతో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ లోపల, బయట ఏం జరిగిందో ప్రజల ముందు సీసీ ఫుటేజ్ ఉంచారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం సినిమా హాల్లోకి వెళ్లి చెప్పినా అల్లు అర్జున్ వినలేదని, సినిమా చూసే వెళ్తానన్నారని పోలీసులు వెల్లడించారు. బలవంతంగా తాము అల్లు అర్జున్ను బయటకు తీసుకువచ్చామని.. అయినా మరోసారి కారు సన్ రూఫ్ నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లాడని తెలిపారు. ఆ వీడియోలన్నీ విడుదల చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో 3 గంటల పాటు విచారించి పలు వివరణలు తీసుకున్నారు. ఆధారాలన్నీ ఆయన ముందు పెట్టి ప్రశ్నించారు. దీంతో తన తప్పులను అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.