
అమరావతి: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట దక్కింది. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని రజనీకి కోర్టు ఆదేశాలిచ్చింది. కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దన్న హైకోర్టు సూచించింది. రజనీ పీఏ రామకృష్ణకు కూడా 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించింది. లక్ష్మీ బాలాజీ స్టోన్స్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి విడదల రజిని 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఏసీబీ కేసు నమోదు చేయగా.. మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు ఏ1గా చేర్చారు. ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాను ఏ2గా చేర్చారు. రజిని మరిది గోపిని ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా పేర్కొన్నారు. ఈ కేసులో విడదల రజనీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. 41-ఏ నోటీసులు ఇచ్చి విడదల రజనీని ప్రశ్నించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.