ముడా స్కామ్ కేసు: హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్

ముడా స్కామ్ కేసు: హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్

బెంగుళూర్: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట దక్కింది. ముడా స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన రిట్ పిటిషన్‎ను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. కర్నాటక పాలిటిక్స్ లో ప్రకంపనలు లేపిన ముడా స్కామ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు  చేశారు.

ఈ పిటిషన్ పై శుక్రవారం (ఫిబ్రవరి 7) విచారణ చేపట్టింది. ముడా స్కామ్ కేసును ప్రస్తుతం లోకాయుక్త దర్యాప్తు చేస్తోందని పేర్కొన్న హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు రిజెక్ట్ చేసింది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్ స్నేహమయి కృష్ణ అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. 

అసలు ఏంటి ముడా స్కామ్..?

సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ పేరిట ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. దానికి ప్రతిఫలంగా ముడా వేరే చోట ఆమెకు భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఈ తతంగం అంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు.

దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధ రామయ్య, ఆయన సతీమణి పార్వతమ్మ, మరి కొందరిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముడా స్కామ్‎లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ.. లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇదిలా ఉండగానే.. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. న్యాయస్థానం రిజెక్ట్ చేసింది.